ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నహితుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వార్తల్లో వ్యక్తిగా తరచూ నిలుస్తున్నారు.
వైసీపీని వీడేది లేదంటారు. ఆ వైసీపీలో ఆయన ఇబ్బంది పడుతున్నారు. అధినేత వైఎస్ జగన్ అపాయింట్మెంట్ తనకు దక్కడం గగనంగా మారిందంటూ మీడియాకి స్వయంగా ఆయనే లీకులు పంపుతున్నారు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రితో భేటీ అవుతున్నారు, ఫలానా బాధ్యతని ముఖ్యమంత్రి తనకు అప్పగించారని గర్వంగా చెప్పుకుంటున్నారు. అంతలోనే, అసంతృప్తిని వెల్లగక్కుతున్నారాయన.
మంత్రి వర్గ విస్తరణలో భాగంగా మంత్రి పదవి కోల్పోయినప్పటినుంచీ, బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యవహార శైలి, పార్టీ అధినాయకత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. అయితే, బలమైన అనుచరగణం వున్న నాయకుడు కావడం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడం.. ఇవన్నీ ఇంకా బాలినేని వైసీపీలో కొనసాగేలా చేస్తున్నాయి.
కానీ, బాలినేని కారణంగా వైసీపీకి జరుగుతున్న డ్యామేజ్ అంతా ఇంతా కాదు. చివరి నిమిషంలో బాలినేని గనుక పార్టీని వీడితే, ఆ డ్యామేజ్ వేరే లెవల్‌లో వుంటుంది. అందుకేనేమో, అధినాయకత్వం బాలినేని శ్రీనివాస్ రెడ్డి విషయమై త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
బాలినేని కాకపోతే, ఆ స్థానంలో ప్రత్యామ్నాయం ఏంటి.? అన్నదానిపై ఇప్పటికే అధినాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందట. ఈ నేపథ్యంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా అనుచరగణంతో ప్రత్యేక భేటీలు నిర్వహిస్తున్నారు భవిష్యత్ రాజకీయ కార్యాచరణకు సంబంధించి.!