టీడీపీ కొంప ముంచేసిన తారక రత్న వ్యవహారం.!

పాదయాత్ర ప్రారంభమైతే, ఆపకూడదన్న రూల్ ఏమీ లేదు. ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదు. తారక రత్న తీవ్ర గుండె పోటుకు గురయ్యాడు నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర సందర్భంగా. లోకేష్ పాదయాత్ర, నందమూరి గుండెల్లో కుంపటి.. అనే ప్రచారమైతే గట్టిగా సాగుతోంది.

బ్యాడ్ టైమింగ్ అనుకుని.. పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చేసి వుంటే బావుండేది. కానీ, లక్షలు ఖర్చు చేసి.. ఏర్పాట్లు చేసుకున్నాక.. పాదయాత్రకు తాత్కాలిక విరామమంటే కష్టమే. కానీ, తప్పదు. ప్రాణం కంటే లక్షలు, కోట్లు ఎక్కువేం కాదు కదా.?

లోకేష్ స్వీయ బాధ్యతగా.. తారక రత్న వైద్యానికి సంబంధించిన వ్యవహారాలు చూసుకుని వుంటే బావుండేది. కానీ, అలా జరగడంలేదు. ఆసుపత్రికి వెళ్ళి తారక రత్న ఆరోగ్య పరిస్థితి గురించి.. అదీ పాదయాత్ర సమయం పూర్తయ్యాక నారా లోకేష్ తెలుసుకుంటే.. అందులో బాధ్యత ఏముంటుంది.? స్వయానా మేనమామ కొడుకు తారక రత్న, నారా లోకేష్‌కి.

ఈ విషయమై నారా లోకేష్ మీద తీవ్ర విమర్శలే వస్తున్నాయి. మొదటి రోజు మమ.. అనిపించేసి, రెండో రోజు కూడా అదే పని చేసి.. చిన్న బ్రేక్ పాదయాత్రకు నారా లోకేష్ ఇచ్చి వుంటే.. తారక రత్న పట్ల బాధ్యత తీసుకున్నట్లుగా ఆసుపత్రికే పరిమితమైతే.. టీడీపీకి కూడా పొలిటికల్ మైలేజ్ వచ్చేది.

కానీ, అలా జరగలేదు. ముందు ముందు ఈ వ్యవహారం నారా లోకేష్‌కే కాదు, టీడీపీకి సైతం రాజకీయంగా పెద్ద మైనస్ అవుతుందన్నది నిర్వివాదాంశం.