ఉత్తరాంధ్రకు చెందిన బిసి నేత, సీనియర్ శాసనసభ్యుడు తమ్మినేని సీతారామ్ శాసనసభ స్పీకర్ గా నియమితులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైఎస్సార్ ఎల్పీ సమావేశం తర్వాత సీతారామ్ ను జగన్ తన దగ్గరకు పిలిపించుకుని మాట్లాడారు. దాంతో సీతారామ్ ను స్పీకర్ గా నియమించటం ఖాయంగా జగన్ మీడియా కూడా చెబుతోంది.
ఇప్పటి వరకూ స్పీకర్ గా ఆనం రామనారాయణరెడ్డి, కోన రఘుపతి, అంబటి రాంబాబుల పేర్లు బాగా ప్రచారమైన విషయం తెలిసిందే. అయితే తాజా పరిణామాల నేపధ్యంలో స్పీకర్ గా సీతారామ్ పేరే ఖాయమవతుందని అనుకుంటున్నారు.
తమ్మినేని ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గంకు చెందిన నేత. ఇప్పటి వరకూ సీతారామ్ ఆరుసార్లు ఎంఎల్ఏగా గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో తన మేనల్లుడు, టిడిపి నేత అయిన కూన రవికుమార్ పై సుమారు 14 వేల ఓట్ల మెజారిటితో గెలిచారు.
శ్రీకాకుళం జిల్లాలోని బిసి కళింగ సామాజికవర్గానికి చెందిన బలమైన నేత. గతంలో టిడిపిలో ఉన్నపుడు తొమ్మిదేళ్ళు మంత్రిగా పనిచేశారు. ఇదే విషయమై తమ్మినేని మాట్లడుతూ, తనను స్పీకర్ గా నియమిస్తున్నట్లు జగన్ స్పష్టం చేశారని తమ్మినేని చెప్పారు. అసెంబ్లీకి తన పనితీరు ద్వారా గౌరవం తీసుకొస్తానని స్పష్టం చేశారు.