జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. వాలంటీర్లపై చేసిన ఆరోపణల దుమారం ఇప్పట్లో తగ్గేలా లేదు. ఆ వివాదాస్పద వ్యాఖ్యల ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు రోడ్లపైకి వచ్చారు. పవన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఆయన ఫొటోలు, ఫ్లెక్సీలను తగులబెట్టారు. బహిరంగంగా క్షమాపణలు చెప్పేంత వరకూ వెనక్కి తగ్గబోమంటూ హెచ్చరించారు.
ఇదే సమయంలో రాష్ట్ర మహిళా కమిషన్ సైతం పవన్ కు నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లో మీకు సమాచారం ఇచ్చిన అధికారి వివరాలు చెప్పాలి. అలాకానిపక్షంలో అవన్నీ అబద్దపు ఆరోపణలని, ప్రభుత్వంపైనా – వాలంటీర్లపైనా కావాలనే బురదజల్లినట్లు అంగీకరించి క్షమాపణలు చెప్పాలని తెలిపారు. దీంతో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంత సీరియస్ గా తీసుకున్నదనేది స్పష్టమవుతుంది.
ఇదే సమయంలో పవన్ వ్యాఖ్యలపై తాజాగా ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. పవన్ ఇంత నీచంగా మాట్లాడతాడని తాను ఊహించలేదని అన్నారు. అతని వ్యాఖ్యలను చూస్తూ ఊరుకోవాల్సిన పని లేదని ఈ సందర్భంగా వాలంటీర్లకు, ప్రభుత్వానికి పరోక్షంగా సూచించారు! ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన తమ్మారెడ్డి… మనుషుల అక్రమ రవాణా అంశాన్ని తేలిగ్గా తీసుకోకూడదని చెబుతూ.. దీనిపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఇదే సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు భరద్వాజ కొన్ని కీలక సూచనలు చేశారు. వాలంటీర్లు వేలాదిమంది మహిళలను అక్రమంగా రవాణా చేశారంటూ పవన్ కల్యాణ్ ఆరోపించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. వాలంటీర్లపై ఇంత నీచంగా మాట్లాడితే ఊరుకోవాలా? అంటూ ప్రశ్నించారు. వేలాది మంది మహిళలు వాలంటీర్ల వల్ల అదృశ్యమౌతుంటే.. సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు, గానీ కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు గానీ ఆపకుండా ఉంటాయా? అని సందేహం వ్యక్తం చేశారు!
ఇక మహిళలను అక్రమంగా రవాణా చేస్తోన్నట్లు పవన్ కు ఢిల్లీ నుంచి నిఘా వర్గాల ద్వారా సమాచారం వచ్చిందంటే… కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? అని తమ్మారెడ్డి ప్రశ్నించారు. నోటికి వచ్చినట్లల్లా మాట్లాడటం రాజకీయ నాయకుడి లక్షణం కాదని పేర్కొన్నారాయన. పవన్ కల్యాణ్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఊహించలేదని చెప్పారు. దీంతో… కేంద్ర ప్రభుత్వ అసమర్ధతను పవన్ ఎత్తి చూపాడనే కామెంట్లు మొదలైపోతున్నాయి.
అయితే ఈ విషయంపై ఇటు రాష్ట్రప్రభుత్వం కానీ, అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది వేచి చూడాలి. ముఖ్యంగా జగన్ ఎంతో నమ్మకం పెట్టుకున్న, జగన్ ని ఎంతో నమ్మిన వాలంటీర్లపై పవన్ ఈస్థాయిలో మాట్లాడినా కూడా… జగన్ సర్కార్ సైలంటుగా ఉండటాన్ని పలువురు చేతకానితనంగా చూస్తున్నారు. లేకపోతే… పవన్ వ్యాఖ్యల్లో నిజం ఉండి ఉండొచ్చని చెబుతున్నారు. మరి జగన్ ఇలానే చూస్తూ ఉంటారా? లేక చర్యలకు ఉపక్రమిస్తారా? అన్నది వేచి చూడాలి!!