వంశీని ఢీకొట్టాలని తహతహలాడుతున్న మహిళా నేత.. చంద్రబాబు సహాయం కావాలట ?

Sunkara Padmasri to join TDP
గన్నవరం నియోజకవర్గంలో సత్తా చూపాలని  దాదాపు అన్ని పార్టీలు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.  కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు, వైసీపీ ఇలా అన్ని పెద్ద పార్టీలో గన్నవరంలో పట్టు కోసం పోటీపడ్డవే.  గన్నవరం ఓటర్లు కూడ ఒకసారి ఒక పార్టీని ఆదరిస్తే ఇంకోసారి ఇంకో పార్టీకి పట్టంకట్టేవారు.  అలా గన్నవరంలో ఒకప్పుడు కాంగ్రెస్ హవా గట్టిగా వీచినా 1989 తర్వాత మళ్ళీ ఆ పార్టీ అభ్యర్థి గెలవలేదు.  ఆ తరవాత మొత్తం టీడీపీదే పైచేయిగా ఉంటూ వచ్చింది.  గత ఎన్నికల్లో వైసీపీ విఫలమైన చోట్లలో గన్నవరం కూడ ఒకటి.  1999 నుండి నాలుగసార్లు టీడీపీయే గెలిచింది.  గత రెండుసార్లు వల్లభనేని వంశీ  ఎమ్మెల్యేగా గెలిచారు.  అయితే కాంగ్రెస్ నుండి సుంకర పద్మశ్రీ గన్నవరంలో ఎమ్మెల్యేగా గెలవాలని చాలానే ట్రై చేశారు.  
Sunkara Padmasri to join TDP
Sunkara Padmasri to join TDP
 
కానీ కుదరలేదు.  అతి కష్టం మీద ఒకసారి టికెట్ పొందినా గెలవలేకపోయారు.  ఆ ఓటమితో పార్టీ ఆమెను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.  అటు తర్వాత కాంగ్రెస్ పార్టీయే బలహీనపడిపోయింది.  నేతలంతా ఎవరి దారి వారు చూసుకున్నారు.  కానీ పద్మశ్రీ మాత్రం నిలబడ్డారు.  అవకాశం కోసం ఎదురుచూశారు.  ఆ అవకాశం ఆమెకు ఇప్పుడు వచ్చినట్టు తెలుస్తోంది.  ఎమ్మెల్యే వంశీ టీడీపీ నుండి అనధికారికంగా బయటికి వచ్చేశారు.  దీంతో ఆయనకు ప్రత్యామ్నాయం వెతికే పనిలో ఉన్న బాబుగారు ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిని నియోజకవర్గ ఇంఛార్జుగా నియమించారు.  ఏ దారీ లేక ఆయనకు బాధ్యతలు అప్పజెప్పిన చంద్రబాబు ఇప్పటికీ బెటర్ ఆప్షన్ చూస్తూ ఉన్నారు.  ఈ అవకాశాన్నే వాడుకోవాలని అనుకుంటున్నారు పద్మశ్రీ.  
 
ఆమె తెలుగుదేశంలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు  చెప్పుకుంటున్నాయి గన్నవరం రాజకీయ వర్గాలు.  పద్మశ్రీ బలమైన కమ్మ సామాజికవర్గానికి చెందిన నేత.  ఆర్థికంగా కూడ ఎలాంటి ఇబ్బందీ లేదు.  ఆమెకు లేనిదల్లా పార్టీ పరంగా బలం, మద్దతే.  టీడీపీలోకి వెళితే ఆ రెండూ మెండుగా దొరుకుతాయనేది ఆమె ఆలోచనట.  విశ్లేషకులు సైతం నిత్యం జనంలో ఉండే ఆమెకు చెయ్యందిస్తే బలమైన నేతగా నిలదొక్కుకోగలరని చెబుతూ ఉంటారు.  అందుకే ఆమె టీడీపీ సపోర్ట్  కోరుకుంటున్నారట.  ఇక నియోజకవర్గంలో  టీడీపీకి బలమైన కేడర్ ఉంది.  వైసీపీలో ఎలాగూ వర్గ విబేధాలు తారాస్థాయిలో ఉన్నాయి.  ఈ సమయంలోనే  మంచి నేతను వెతుక్కుంటే ఈసారి కూడా జెండా ఎగరవేయవచ్చని, వంశీకి చెక్ పెట్టవచ్చని బాబుగారు ఆలోచిస్తున్నారు.   ఆయనకు పద్మశ్రీ మంచి ఛాయిస్ అయ్యే అవకాశం లేకపోలేదు.