రాయపాటికి ఎర్త్ పెడుతున్న సుజనా… జరిగేనా?

టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లి అజ్ఞాతవాసం పూర్తిచేసి తిరిగి టీడీపీలోకి రావడానికి చాలా మంది నేతలు రెడీగా ఉన్నారని.. గతకొన్ని రోజులుగా విశ్లేషణలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో… టీడీపీ సీనియర్ నేత, ప్రస్తుత బీజేపీ నేత సుజనా చౌదరి… త్వరలో తిరిగి సొంత గూటికి చేరబోతున్నారని తెలుస్తుంది. సరే వస్తే వచ్చారు అని గుంటూరు తమ్ముళ్లు అనుకునేలోపు… రాయపాటికి చెక్ పెట్టబోతున్నారని తెలుస్తుంది.

గతంలో టీడీపీ తరఫున రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన సుజనా చౌదరి… 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక, సేఫ్ జోన్ ఎంచుకునే క్రమంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు! ప్రస్తుతం ఆయన బీజేపీలోనే ఉన్నప్పటికీ… చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు, టీడీపీ నేతలతో పాత పరిచయాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఒకానొక సందర్భంలో… చంద్రబాబే సుజనాను బీజేపీలోకి పంపారనే వార్తలు కూడా వచ్చాయి. అప్పుడు సుజనా ఉన్న పరిస్థితుల్లో కాషాయ కండువా కప్పుకోవడమే సేఫ్ అని చెప్పినట్లు కథనాలొచ్చాయి.

అయితే ప్రస్తుతం జాతీయస్థాయిలో కూడా బీజేపీ గ్రాఫ్ కూడా కాస్త తగ్గుతున్న తరుణంలో… ఇక సొంత గూటికి చేరాలని సుజనా భావిస్తున్నారంట. ఇందులో భాగంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని, గుంటూరు ఎంపీ సీటుకు పోటీచేయాలని ఆశిస్తున్నారంట. దీనికితోడు… గుంటూరు జిల్లా టీడీపీ నేతలతో సుజనా చౌదరికి మంచి సంబంధాలే ఉండటంతో గుంటూరు నుంచి పోటీకి స్థానిక కేడర్ కూడా అభ్యంతరం చెప్పబోరని ఆయన భావిస్తున్నట్టు సమాచారం.

అయితే… ఎవరు అభ్యంతరం చెప్పినా చెప్పకపోయినా… రాయపాటి మాత్రం అభ్యతరం వ్యక్తం చేస్తారని టాక్ వినిపిస్తుంది. కారణం… ఈ సారి ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీ నుంచి తాను ఎంపీగా పోటీచేస్తున్నట్లు రాయపాటి ఇప్పటికే ప్రకటించారు. రాయపాటి అలకల సంగతి బాగా తెలిసిన బాబు… ఆయన్ను కాదంటారని కూడా అనుకోలేని పరిస్థితి. అయితే… తనకు సీటిచ్చే విషయంలో రాయపాటి బాబుకు ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు.

తన కుమారుడుకి సత్తెనపల్లి సీటుతో పాటు.. తన తమ్ముడి కుమార్తెకు మరో అసెంబ్లీ టిక్కెట్ ఇస్తే… తనకు ఎంపీ సీటు ఇవ్వకపోయినా పర్లేదని చెప్పారు. అంటే… ఇప్పుడు రాయపాటి.. గుంటూరు ఎంపీ సీటు వదులుకుని, సుజనాకు సపోర్ట్ చేయాలంటే… సత్తెనపల్లి అసెంబ్లీ సీటు కచ్చితంగా ఆయన కుమారుడికి ఇవ్వాలన్నమాట! ప్రస్తుతం సత్తెనపల్లిలో కోడెల ఫ్యామిలీకి – కన్నా లక్ష్మీనారాయణకు జరుగుతున్న ఇంటర్నల్ వార్ నేపథ్యంలో… వాళ్లిద్దరినీ కాదని రాయపాటి ఫ్యామిలీకి ఇస్తారని అస్సలు అనుకోలేని పరిస్థితి.

మరి ఈ నేపథ్యంలో… గుంటూరు ఎంపీ సీటు కూడా బాబుని ఇబ్బంది పెట్టేస్తుందని అంటున్నారు విశ్లేషకులు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాల సంగతి కాసేపు పక్కనపెడితే… ఆర్థికంగా బలవంతుడైన సుజనా… పార్టీలోకి రావడం అందరికీ ఆమోదయోగ్యమే కావొచ్చు. కానీ… రాయపాటి సమస్య పరిష్కరించ కుండా సుజన ను రంగంలోకి దింపితే మాత్రం… గుంటూరు టీడీపీలో వర్గపోరు తప్పదు అని క్లారిటీ ఇస్తున్నారు విశ్లేషకులు!

కాగా… సుజానా చౌదరి… బ్యాంకులను మోసం చేశారంటూ గతంలో ఆరోపణలు ఎదుర్కోవడం, ఈడీ ఈ మేరకు తన ట్విట్టర్ లో కొన్ని అంశాలు తెరపైకి తేవడం.. దీంతో ఆయన సైకిల్ దిగి బీజేపీలో చేరిపోవడం.. ఫలితంగా ఆ వివరాలు మరుగునపడిపోవడం తెలిసిందే. ఇదే విషయాలపై ఇప్పటికీ “వాషింగ్ పౌండర్ నిర్మా” అంటూ తెలంగాణలో బీఆరెస్స్ నేతలు పోస్టర్స్ వేస్తున్న సంగతీ తెలిసిందే!