తెలంగాణలో విద్యార్దులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మహాకూటమి నేతలు రేవంత్ రెడ్డి, దేవేందర్ గౌడ్ ను విద్యార్ధి జనసమితి సికింద్రాబాద్ పార్లమెంట్ నేతలు రవితేజ గౌడ్, భానుచంద్ర, కొక్కు రాం కుమార్ కలిశారు. తెలంగాణలో గత నాలుగేళ్ల కాలంలో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశారని వారు వివరించారు.
డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలకు ఫీజు రీయింబర్స్ మెంట్ రాక విద్యార్దులు నరకం అనుభవిస్తున్నారన్నారు. మహాకూటమి మ్యానిఫేస్టోలో విద్యార్దుల స్కాలర్ షిపు పెంపుతో పాటు ప్రతి సంవత్సరం రీయింబర్స్ మెంట్ విడుదల చేసేలా పెట్టాలని వారు కోరారు. ప్రైవేటు కళాశాలలు విద్యార్దుల ఒరిజినల్ సర్టిఫికెట్లు పెట్టుకొని వేధిస్తున్నాయన్నారు. అధిక ఫీజులు పెంచి విద్యార్దుల నడ్డి విరుస్తున్నారన్నారు. తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తున్నారని వారు నాయకులకు తెలిపారు.
విద్యా వ్యవస్థను వ్యాపారమయంగా చేశారని ఆ పరిస్థితి లేకుండా చూడాలని వారు కోరారు. చదువుల ఒత్తిడితో కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్దులు చచ్చిపోతున్నా కూడా సర్కార్ పట్టించుకోలేదని వారు నేతలకు వివరించారు. చక్కటి విద్యా వ్యవస్థను తీసుకొచ్చి నైతికత విలువలను పెంచేలా విద్యా వ్యవస్థను తయారు చేయాలని వారు కోరారు. చదువులు పూర్తి కాగానే ఉద్యోగాలు వచ్చే విధంగా సంస్కరణలు తీసుకురావాలని వారు కోరారు.
విద్యార్దులు ఎన్ని రకాలుగా ఉద్యమించినా కూడా కనీసం చర్చలు జరపలేదని విద్యార్దులను పట్టించుకున్న పాపాన గత సర్కార్ పోలేదన్నారు. ఏ రోజు కూడా కనీసం విద్యా వ్యవస్థ పై సమీక్షించలేదన్నారు. కునారిల్లిన విద్యా వ్యవస్థను కాపాడాలన్నారు. ప్రైవేటు అధ్యాపకులు, టిచర్లు జీతాలు లేక బాధపడుతున్నారని వారికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చాలా మంది టీచర్లు రాకుండా ఆటలాడుతున్నారని అటువంటి వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు.
హాస్టళ్లలో విద్యార్దులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చాలా పాఠశాలలకు, కళాశాలలకు పురాతన బిల్డింగ్ లు ఉన్నాయని వాటి స్థానంలో కొత్త వాటిని నిర్మించాలన్నారు. టిఆర్ ఎస్ పరిపాలనలో విద్యార్దులకు వారు చేసిందేం లేదన్నారు. మహాకూటమిలో ఇవన్నీ అంశాలను చేర్చి విద్యార్దులకు న్యాయం చేయాలని వారు కోరారు. వారి వినతిపట్ల నేతలు రేవంత్ రెడ్డి, దేవేందర్ గౌడ్ సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు.