షాకింగ్ న్యూస్ : తెలంగాణ విద్యాశాఖలో విచిత్ర లీలలు

8 సంవత్సరాలుగా ఒకే పాఠశాలలో పనిచేసిన తర్వాత వేరొక పాఠశాలకు బదిలీ అయినా ఆ పంతులమ్మ వెళ్లలేదు. తనకు ఇష్టం లేని పాఠశాలకు వెళ్లనని ప్రస్తుతం తాను పనిచేస్తున్న గ్రామ పంచాయతీ పరిధిలోనే మరో పాఠశాలకు బదిలీ అయ్యింది. అది కూడా ఆ పంతులమ్మ చెప్పే సబ్జెక్టు లేని బాలుర పాఠశాలకు బదిలీ చేయించుకుంది.

ఇంత జరుగుతున్నా డైరెక్టర్ ఆఫ్ స్కూల్  ఎడ్యుకేషన్, రీజనల్ డైరెక్టర్ వరంగల్, వరంగల్ అర్బన్ జిల్లా విద్యాధికారి  అందరూ కళ్లు మూసుకొని ఉత్తర్వులిచ్చారని పలు ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. అసలు వివరాలు తెలియాలంటే ఈ స్టోరి చదవాల్సిందే…

వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ బాలికల పాఠశాలలో జె. సత్య అనే ఉపాధ్యాయురాలు కుట్లు , అల్లికలు సబ్జెక్ట్ లో ఒకేషనల్ ఇన్ స్ట్రక్టర్ గా పని చేస్తున్నారు. దాదాపు 8 సంవత్సరాలు ఈ పంతులమ్మ ఇదే పాఠశాలలో పనిచేశారు.

ఇటీవల జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో తప్పనిసరి పరిస్థితుల్లో సత్య బదిలీ కావల్సి వచ్చింది. దీంతో ధర్మారం పాఠశాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఉపాధ్యాయ బదిలీలు జరిగి 3 నెలలు దాటినా ఆమె పాఠశాల నుంచి ఉపాధ్యాయురాలు పాఠశాల నుంచి రిలీవ్ కాకుండా కాలం గడిపారు.

తనకు ఇష్టం లేని  గ్రామానికి బదిలీ చేశారని చెబుతూ ధర్మసాగర్ గ్రామపంచాయతీ పరిధిలోనే బాలుర పాఠశాలకు బదిలీ చేయించుకున్నారు. 8 సంవత్సరాలు దాటిన తర్వాత ఒకే గ్రామ పంచాయతీ పరిధిలో బదిలీ చేయకూడదనే నిబంధనను అధికారులు తుంగలో తొక్కి ఆమెను బదిలీ చేశారు.

సత్య చెప్పే అల్లికలు, కుట్లు సబ్జెక్టు బాలుర పాఠశాలలో లేదు. టివి రిపేరింగ్, ట్రేడ్ పోస్టులోకి కుట్లు, అల్లికలు అర్హత ఉన్న సత్యను బదిలీ చేశారు. బాలికలకు ఉపకరించే టిచర్ ను బాలుర పాఠశాలకు పంపించారు. ఒకేషనల్ ఇన్ స్ట్రక్టర్ వారు చెప్పే సబ్జెక్ట్ , ట్రేడ్ కు అనుగుణంగా అదే ట్రేడ్ లో ఉన్న ఖాళీలకు బదిలీ చేయాలి. కానీ ఇవేమి పట్టించుకోకుండా బదిలీ చేశారు.

ధర్మసాగర్ లోని బాలికల పాఠశాల నుంచి బాలుర పాఠశాలకు బదిలీ చేస్తూ 8-10-2018 న గుట్టు చప్పుడు కాకుండా ఉత్తర్వులు జరీ చేశారు. 27-10-2018న సత్య  ధర్మ సాగర్ బాలికల పాఠశాల నుంచి రిలీవ్ అయ్యింది. ఆ తర్వాత వెంటనే జాయిన్ కావాల్సి ఉన్నా 05-11-2018 న తనను చేర్చుకోవాలంటూ ఆర్డర్ కాపీని తీసుకొని  బాలుర పాఠశాలకు వెళ్లారు. 

ఉపాధ్యాయురాలు ఇంత క్రమశిక్షణ లేకుండా చేస్తున్న అధికారులు కనీసం ఆమె గురించి పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. 

 

ఇవి అనుమానాలు 

    . జూలైలో జరిగిన వెబ్ కౌన్సిలింగ్ బదిలీల్లో ధర్మారం పాఠశాలకు బదిలీ అయినా ఆ ఉత్తర్వులు అమలు కాకపోవడం

  • 3 నెలలుగా పాఠశాల నుంచి రిలీవ్ కాకపోయినా హెడ్ మాస్టర్ మీద కానీ, సదరు టిచర్ పై కానీ చర్య తీసుకోకపోవడం

  • తన సబ్జెక్టు కాకపోయినా ఇతర సబ్జెక్ట్ ట్రేడ్ లోకి రెండో సారి బదిలీ చేయడం

  • ఒకే గ్రామ పంచాయతీ పరిధిలోకి బదిలీ చేయకూడదనే నిబంధనలు ఉల్లంఘించడం

  • బాలికలకు ఉపయోగపడే వృత్తి శిక్షకురాలిని బాలుర పాఠశాలకు బదిలీ చేయడం

  • రాష్ట్ర స్థాయి ఉత్తర్వులను అమలు చేయడంలో వాస్తవ పరిస్థితులను తెలుసుకొని రిపోర్ట్ చేయవలసిన వరంగల్ ఆర్జేడి కనీస విచారణ లేకుండా ఉత్తర్వులు జారీ చేయడం  

 

డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్ నుంచి వచ్చిన ఉత్తర్వుల కాపీ

ఇదంత కూడా అధికారులు నిబంధనలను తుంగలో తొక్కి వ్యవహరించారని పలువురు విమర్శిస్తున్నారు. 8 సంవత్సరాలు ఒకే పంచాయతీ పరిధిలో పనిచేసిన టిచర్ ను మళ్లీ ఎలా సేమ్ పంచాయతికి బదిలీ చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. పంతులమ్మతో పాటు ఆ పంతులమ్మకు సహకరించిన అధికారుల పై తక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.