అవును జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను అదే అనుమానం వస్తోంది. పోయిన సంవత్సరం అక్టోబర్ 25వ తేదీన విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. హై కోర్టు ఆదేశాలతో ఆ కేసును ఎన్ఐఏ విచారిస్తోంది. ఇపుడా విచారణ జరిగేందుకు వీల్లేదంటూ రాష్ట్రప్రభుత్వం తాజాగా హై కోర్టులో పిటీషన్ వేసింది. రెండు రోజుల క్రితమే అత్యవసర పిటీషన్ గా విచారించాలంటూ హౌస్ మోషన్ పిటిషన్ వేస్తే కోర్టు కొట్టేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇపుడు మళ్ళీ రెగ్యులర్ విచారణ కోసం మరో పిటీషన్ వేయటం గమనార్హం. మరి ఈ పిటీషన్ ను కోర్టు ఏమి చేస్తుందో చూడాల్సిందే.
సరే, ఆ కేసు విషయాన్ని పక్కనపెడితే అసలు ఎన్ఐఏ విచారణను అడ్డుకోవాలని రాష్ట్రప్రభుత్వం ఎందుకంత పట్టుదలగా ఉంది. ? ఇక్కడే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. తనను అంతం చేయటానికే చంద్రబాబునాయుడు అండ్ కో కుట్ర పన్నినట్లు జగన్ ఆరోపిస్తున్నారు. హత్యాయత్నం ఘటనలో చంద్రబాబే మొదటి ముద్దాయంటూ వైసిపి నేతలు కూడా ఆరోపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. హత్యాయత్నం ఘటనలో నిందితుడు శ్రీనివాస్ పాత్రదారి మాత్రమేనని అసలు సూత్రదారలు ఎవరు అన్న విషయంలో ఎవరి అనుమానాలు వాళ్ళకున్నాయి.
సూత్రదారులెవరో తేలాలంటే థర్డ్ పార్టీ విచారణ జరపాల్సిందేనన్న జగన్ వాదనతో కోర్టు కూడా ఏకీభవించింది. అందుకనే రాష్ట్రప్రభుత్వం ఎంత వ్యతిరేకించినా హై కోర్టు వినకుండా ఎన్ఐఏ విచారణకు ఆదేశించింది. అప్పటి నుండి చంద్రబాబు అండ్ కో గగ్గోలు ఎక్కువైపోయింది. చంద్రబాబుకు కానీ మరో కీలక నేతలకు కానీ జగన్ పై జరిగిన దాడిలో ఏవిధంగాను సంబంధం లేకపోతే అంతలా గగ్గోలు పెట్టాల్సిన అవసరం ఏముంటుంది ? విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ తనపై తానే దాడి చేయించుకున్నాడని కదా చంద్రబాబు అండ్ కో మొదటి నుండి చెబుతున్నది ? ఆ విషయం ఏదో ఎన్ఐఏ విచారణలో తేలిపోతే చంద్రబాబుకే అడ్వాంటేజ్ కదా ?
ఎన్నికలకు ముందు సానుభూతి కోసం జగనే తనపై దాడి చేయించుకున్నాడని చంద్రబాబు ఊరూవాడ ఎక్కి ఊదరగొట్టే అవకాశాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు ? అందరిలో పెరిగిపోతున్న అనుమానాలేమిటంటే ? జగన్ పై టిడిపిలోని ఎవరో కీలక నేతే దాడి చేయించాడని. ఎన్ఐఏ విచారణ జరిగితే ఆ కీలక నేత వేసుకున్న ముసుగు తొలగిపోతుంది. ఆ నేతను గనుక ఎన్ఐఏ విచారిస్తే అసలు గుట్టు బయటపడుతుంది. అప్పుడు చంద్రబాబుకు అవస్తలు తప్పవు. సరిగ్గా ఎన్నికలకు ముందు గుట్టు బయటపడితే రేపటి ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందన్న భయమే చంద్రబాబులో కనబడుతోంది. అందుకనే ఎన్ఐఏ విచారణను తీవ్రస్ధాయిలో వ్యతిరేకిస్తున్నారు. మరి కోర్టు ఏం చెబుతుందో చూడాలి ?