శ్రీలంకతో ఆంధ్రప్రదేశ్‌ని పోల్చడమా.? ఎంతవరకు సబబు.?

శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది.. అక్కడి ప్రజా ప్రతినిథులపై ప్రజలు తిరగబడ్డారు. ఆంధ్రప్రదేశ్ కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది.. ఇక్కడా ప్రజా ప్రతినిథులపై ప్రజలు తిరగబడ్డారు..

ఇదీ కోనసీమ జిల్లా అమలాపురంలో ప్రజా ప్రతినిథుల ఇళ్ళను ఆందోళనకారులు తగలబెట్టడంపై జరుగుతున్న చర్చ తాలూకు తీరు. సోషల్ మీడియాలో ఇలాంటి మీమ్స్ చాలానే వైరల్ అవుతున్నాయి.

గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో పోల్చి చూస్తున్నారు రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు కూడా. శ్రీలంక వ్యవహారాల్ని బూచిగా చూపుతూ, జగన్ సర్కారుపై ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు సహా, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే.

దానికి కౌంటర్ ఎటాక్ ఇస్తూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలాగే వైసీపీకి చెందిన చాలామంది నేతలూ కూడా శ్రీలంక వ్యవహారాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఆ ప్రభావం కోనసీమ వాసులపై పడిందా.? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. నిజానికి, పరిస్థితి అత్యంత సున్నితంగా వున్న ఈ సమయంలో, ఇలాంటి పోలీకలు, చర్చలు, మీమ్స్.. అస్సలేమాత్రం సబబు కాదు.

ఒక్కటి మాత్రం నిజం. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే. ఉద్యోగుల పీఆర్సీ వ్యవహారంలో కావొచ్చు, సీపీఎస్ రద్దు వ్యవహారంలో కావొచ్చు.. ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇదొక్కటే కాదు, చాలా విషయాల్లో ప్రభుత్వం ఒంటెద్దు పోకడ ప్రదర్శిస్తున్నమాట వాస్తవం.

మూడు రాజధానుల విషయమైనా అంతే. ఇలాంటి వ్యవహారాల్లో ‘అధికార అహంకారం’ ప్రదర్శిస్తే, ప్రజాగ్రహం ముందు అధికారం గుండు సున్నా.. అనే విషయం కోనసీమ ఘటనలతో నిరూపితమవుతుంటుంది.

శ్రీలంకతో పోలిక అనవసరం. కానీ, ప్రభుత్వం తన బాధ్యతను గుర్తెరగాలి. ప్రజాగ్రహాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. తమ పాలన పట్ల, తమ చేష్టల పట్ల ప్రజల్లో పెరుగుతున్న అసహనాన్నీ గుర్తించి అప్రమత్తమవ్వాలి.