ఏపీ పంచాయతీ ఎన్నికల తొలివిడత పోలింగ్, ఫలితాల వెల్లడి ముగిసింది. ఈ పల్లె పోరులో వైఎస్సార్‌సీపీ ఎక్కువ స్థానాలు దక్కించుకోగా.. టీడీపీ రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ, జనసేనలకు నామమాత్రపు విజయాలు దక్కాయి. ఇదిలా ఉంటే ఎస్ఈసీ నిమగడ్డ రమేష్ కుమార్ సొంత ఊరిలో పంచాయతీ ఎన్నికలపై అందరి ఫోకస్ ఉంది.
ఆయన ఓటు వ్యవహారంపై వివాదం రేగడంతో ఆ ఊరి ఎన్నికలపై అందరూ చర్చించుకున్నారు.ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ సొంత ఊరిలో వైఎస్సార్‌సీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు విజయం సాధించారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల గ్రామంలో సర్పంచ్, ఆయన నివాసం ఉన్న వార్డులో కూడా వైఎస్సార్‌సీపీ అభిమానులు గెలుపొందారు.
గ్రామ సర్పంచ్ పదవిని బాలావర్తు కుషీబాయి 1,169 ఓట్ల భారీ మెజారిటీతో గెల్చుకున్నారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ సొంత వార్డులో వైఎస్సార్‌సీపీ అభిమాని ఆత్మకూరు నాగేశ్వరరావు భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం 490 ఓట్లు పోలవగా నాగేశ్వరరావుకు 256 ఓట్లు వచ్చాయి. టీడీపీ మద్దతుదారుకు 145 ఓట్లు పోలయ్యాయి.