బిగ్ బ్రేకింగ్ : కోడెలకు ప్రత్యేక కోర్టు షాక్

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ కు ప్రత్యేకకోర్టు పెద్ద షాకే ఇచ్చింది. పోయిన ఎన్నికల్లో తాను రూ 11.50 కోట్లు ఖర్చు  పెట్టినట్లు స్వయంగా కోడుల ఓ మీడియా ఇంటర్వ్యూలో ఆ మధ్య చెప్పారులేండి. యధాలాపంగా చెప్పారో లేకపోతే జరిగిన విషయాన్ని చెప్పారో తెలీదు. మొత్తానికి కోడెల చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపింది. కోడెల చెప్పిన మాటలపై అప్పటి ఎన్నికల్లో కోడెలపై పోటీ చేసి ఓడిపోయిన వైసిపి అభ్యర్ధి అంబటి రాంబాబు ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు కూడా  చేశారు. తర్వాత ఈసీ కూడా విచారణ జరిపింది. తర్వాత ఆ విచారణ ఏమైందో ఎవరికీ తెలీదు.

అయితే అదే కోడెల ప్రకటనను ఆధారం చేసుకుని కరీనంగర్ నివాసి శ్రీనివాసులరెడ్డి అక్కడి జిల్లా కోర్టులో పిటీషన్ వేశారు. ఆ కోర్టులో కూడా కొంతకాలం విచారణ జరిగింది. ఆ విచారణ కూడా ఎంత వరకు వచ్చిందో బయట ప్రపంచానికి తెలీలేదు. ఇంతలో ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులన్నింటినీ విచారించటానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలంటూ సుప్రింకోర్టు ఆదేశించింది. అందుఓ భాగంగానే ఏపిలో కూడా ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయటమే కాకుండా ప్రజా ప్రతినిధులపైన ఉన్న కేసులను ఆ కోర్టుకు ప్రభుత్వం బదిలీ చేసింది.

ప్రస్తుతం కోడెల కేసు కూడా ఆ ప్రత్యేక కోర్టే విచారిస్తోంది. అందులో భాగంగానే ఈరోజు కేసును విచారించిన ఎంఎల్ఏ, ఎంపిల ప్రత్యేక కోర్టు ఈనెల 10వ తేదీన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఏం చేయాలో కోడెలకు అర్ధం కావటం లేదు. త్వరలో షెడ్యూల్ ఎన్నికలొస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో తనపై ప్రత్యేక కోర్టు విచారణ వేగవంతం చేయటాన్ని కోడెల జీర్ణించుకోలేకున్నారు. మరి 10వ తేదీ కోర్టులో ఏమవుతుందో ఏమో ?