సరిగ్గా ఎన్నికల వేల కొత్తగా పార్టీల్లో చేరి, అప్పటికే అక్కడున్న నాయకులను టెన్షన్స్ కి గురిచేస్తుంటారు కొందరు జంపింగ్ జపాంగ్ నేతలు. ఫలితంగా అధినేతలు సైతం ఆ జంపింగ్ జపాంగ్ లకే ప్రాధాన్యత ఇవ్వడం.. ఇంతకాలం పార్టీని కాపాడుకుంటూ వచ్చిన వారిని సైడ్ చేయడం.. మరో రూపంలో ఎక్కడోకక్కడ అకామిడేట్ చేస్తామని చెప్పడం సర్వసాధారణం. ప్రస్తుతం అలాంటి పరిస్థితులకు వేదికైంది సత్తెనపల్లి లోని టీడీపీ పరిస్థితి!
దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సత్తెనపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. 2019లో అంబటి రాంబాబు చేతిలో ఓడిపోయిన తర్వాత ఆయన తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. అనంతరం కొంతకాలానికి కారణాలేవైనా… హైదరాబాద్ నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తండ్రి మరణానంతరం… డాక్టర్ శివరాం అంతా తానై సత్తెనపల్లి టీడీపీని నడిపించారు. అయితే… ఉన్నట్లుండి కన్నా లక్ష్మీనారాయణ ను బాబు సైకిల్ ఎక్కించుకోవడంతో… శివారాం ఇరకాటంలో పడ్డారు.
తన తండ్రి మరణం తర్వాత ఆ నియోజకవర్గానికి అన్నీ తానై ఉంటున్న శివరాం.. 2024లో సత్తెనపల్లి సీటు తనదే అని బలంగా నమ్మారు. దీంతో… చంద్రబాబును, లోకేష్ ను కలిశారు. కానీ.. ఇంతకాలం ఊరించిన బాబులు.. కన్నా చేరిక తర్వాత శివారాం కు కుదరదని చెప్పేశారు. దీంతో శివరాం వర్గం షాక్ కి గురైంది.
అయితే తాజాగా సత్తెనపల్లి నియోజకవర్గం పెద్దమక్కెనలో శివరాం స్వయంగా కోడెల శివప్రసాద్ రావు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి స్థానిక నేతలతో పాటు నారా రోహిత్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మైకందుకున్న శివరాం… “వచ్చే ఎన్నికల్లో నేనే టీడీపీ అభ్యర్థిగా సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్నాను.. నా తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి స్థానంలో ఉండి నడిపిస్తానని చంద్రబాబు నాకు నాడు హామీ ఇచ్చారు.. చంద్రబాబు, లోకేష్ ఆశీస్సులతో నేను పోటీ చేస్తున్నాను. సత్తెనపల్లి టీడీపీ కార్యకర్తలకు ఇందులో ఎలాంటి అనుమానాలు వద్దు” అని ప్రకటించారు!
అక్కడమొదలైంది టీడీపీలో సత్తెనపల్లి సందడి. పెదకూరపాడు నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహించే కన్నా లక్ష్మీనారాయణను తీసుకొచ్చి తన సీటుకు ఎసరుపెట్టడం ఏమిటని గుర్రుగా ఉన్న శివరాం.. ఇలా ఉన్నఫలంగా కార్యకర్తలను ఇరకాటంలో పడేశారు. ఎందుకంటే… ఇప్పటికే సత్తెనపల్లిలో తానే పోటీచేయబోతున్నట్లుగా మాటతీసుకున్న కన్నా… నియోజకవర్గంలో గ్రౌండ్ లెవెల్ పనులు స్టార్ట్ చేసేశారు కూడా!
దీంతో… సత్తెనపల్లి సీటు ఇంతకాలం పార్టీని నడిపించిన శివరాం కి ఇస్తారా.. లేక, గోడదూకి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణకు ఇస్తారా అన్నది ఇప్పుడు సత్తెనపల్లి టీడీపీ కార్యకర్తల టెన్షన్. మరి ఈ విషయాన్ని బాబు ఇంకా ముదరబెడతారా.. లేక, ఇప్పుడే సెటిల్ చేసి కార్యకర్తలకు క్లారిటీ ఇస్తారా అన్నది వేచి చూడాలి!