దేశంలో బీజేపీ పార్టీ ప్రస్థానం ఒక సీటు నుండి ఇప్పుడు వరుసగా రెండు సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి చేరటానికి ఆ పార్టీకి పనిచేసిన అధ్యక్షుల పాత్ర చాలానే ఉంది. కానీ చూస్తుంటే ఏపీలో బీజేపీ పార్టీకి మైనస్ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారు అనే సందేహం ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో కలుగుతున్నదని సమాచారం. రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరగకపోగా కొన్ని సమస్యలు మాత్రం ఆ పార్టీకి చాలా తలనొప్పిగా మారాయి. ప్రధానంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహారం పార్టీకి పెద్ద తల నొప్పిగా మారింది అనే చెప్పాలి. పార్టీలో ఒక వర్గం నేతలతో మాత్రమే ఆయన సన్నిహితంగా ఉంటూ వారిని మాత్రమే ప్రోత్సహిస్తున్నారని మరొక వర్గం నేతలు అసంతృప్తిగా ఉన్నారట.
మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పార్టీలో ఉన్న అందరు నేతలతో చాలా సన్నిహితంగా ఉంటూ అందరికి అవకాశం కలిపించేవారు, చాలా మంది నేతలు స్వేచ్చగా మీడియా ముందు మాట్లాడే వారు కూడా. కానీ బీజేపీ చీఫ్ గా సోము వచ్చిన తర్వాత వైసీపీతో ఎవరు అయితే సన్నిహితంగా ఉంటారో వారు మాత్రమే మీడియాతో మాట్లాడుతున్నారు. సోము కంటే బలమైన కామినేని గాని, కన్నా లక్ష్మీ నారాయణ గాని, సుజనా చౌదరి గాని ఎవరూ మీడియాతో మాట్లాడటం లేదు. సోము వీర్రాజుతో సన్నిహితంగా ఉండే విష్ణు వర్ధన్ రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి. ఎమ్మెల్సీ మాధవ్, ఉత్తరాంధ్రలో ఒకరు ఇద్దరు నేతలు మినహా ఎవరూ మీడియాతో మాట్లాడటం లేదు.
దీనితో పార్టీలో ముందు నుంచి ఉన్న కార్యకర్తలు కూడా సోము పై సీరియస్ గా ఉన్నారు. చివరికి తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా వీళ్ళే స్టార్ నేతలుగా ప్రచారం చేయడం గమనార్హం. అసలు ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి చాలా మంది నేతలకు ఉంది. సోము వీర్రాజు మాట దాటి ఎవరు అయినా ఒక్క మాట మాట్లాడినా సరే వాళ్ళను పార్టీ నుంచి పంపిస్తున్నారు. ఈ వైఖరి ఎంత మాత్రం కరెక్ట్ కాదని బిజెపి నేతలు అంటున్నారు. యువనేతలు కూడా పెద్దగా ఎవరూ లేరు. వీళ్ళకు మాత్రమే సోషల్ మీడియాలో భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళు అందరూ సిఎం జగన్ తో సన్నిహితంగా మాట్లాడే వీడియోలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ అవుతూ ఉంటాయి.