ఏపీ బీజేపీ నేతలకు – వైకాపా నేతలకు మధ్య ప్రస్తుతం వార్ నడుస్తుంది. అందుకు కారణమైంది.. శివరాత్రి రోజున వైకాపా విడుదల చేసిన ఒక ఫోటో! అవును… మహా శివరాత్రి వేళ వైసీపీ ఒక ట్వీట్ వేసింది. అందులో శివుడి ఆకారంలో ఉన్న బాలుడికి జగన్.. పాలు పడుతున్నట్లుగా ఉంది. దానికింద.. “ఆకలి తీర్చడానికే శివారాధన” అంటూ కాప్షన్ పెట్టారు. దీంతో మైకులందుకున్నారు బీజేపీ నేతలు!
అవును… ఈ ఫోటో వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంట.. ఈ ఫోటో పెట్టడం అంటే హిందువులను అవమానించడమేనంట! కాబట్టి.. వైఎస్ జగన్ క్షమాపణలు చెప్పాలనీ డిమాండ్ చేస్తున్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఈ విషయంలో మరొకడుగు ముందుకు వేసిన సోము వీర్రాజు అయితే… దీని మీద ఆందోళన చేపడతామని కూడా హెచ్చరించారు.
దీంతో మైకులందుకున్న వైకాపా నేతలు… తాము కూడా హిందువులమే అని, సరిగ్గా చూస్తే అందులో ఏ తప్పూ కనిపించడం లేదని.. వంకరగా చూడకుండా స్పష్టంగా చూడాలి అన్నట్లుగా ఫైరవ్వడం మొదలుపెట్టారు!
శివరాత్రి వేళ వేసిన ఆ ట్వీట్ లో తప్పేముందని మొదలుపెట్టిన బొత్సా సత్యనారాయణ.. “ఆకలి గొన్న వారి ఆకలి తీర్చడమే శివారాధన అంటే తప్పు ఎక్కడ నుంచి వచ్చింది.. తాము కూడా హిందువులమే.. తమకు ఎక్కడా కనబడని తప్పు వీరిద్దరికి మాత్రం ఎలా కనిపించింది.. కేవలం రాజకీయం కోసం ఇంతలా దిగజారిపోవాలా” అని ఫైరయ్యారు!
అనంతరం మీడియా ముందుకు వచ్చిన కన్నబాబు… జగన్ మోహన్ రెడ్డి అన్ని మతాలనూ గౌరవిస్తారు.. మానవ సేవే మాదవ సేవ అని నమ్మే వ్యక్తి జగన్.. బీజేపీ నేతలకు మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసి పబ్బం గడుపుకోవాలనే యావ తప్ప మరొకటి లేదు అని హాట్ హాట్ కామెంట్స్ చేశారు!
దీంతో… ఏపీలో సోము వీర్రాజు ఆందోళను చేయడానికి ఇంక సమస్యలు ఏమీ లేవా? హిందుత్వం మీద బీజేపీకే పేటేంట్ ఉందా? అని పలువురు కామెంట్ చేస్తున్నారు!