తిరుమలలో ఏదో జరగబోతుంది

పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాసంప్రోక్షణ సందర్బంగా భక్తులను 9 రోజుల పాటు ఆలయానికి అనుమతించం అని టిటిడి చేసిన ప్రకటనను చూస్తే అనుమానాలు కలుగుతున్నాయని వైసిపి ఎమ్మెల్యే రోజా అన్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఏదో చేసేయాలనే టిటిడి, చంద్రబాబు కలిసి ఆడుతున్న నాటకమని ఆమె విమర్శించారు. టిటిడి విధానంతో రమణ దీక్షితులు చేసిన ఆరోపణలన్ని నిజమనిపిస్తుందన్నారు.  పుట్టా సుధాకర్ యాదవ్ చైర్మన్ గా నియామకం అయ్యాకనే ఈ బాగోతాలన్ని బయటికి వస్తున్నాయన్నారు. పోటులో తవ్వకాలు జరిపారని, సిసి కెమెరాలు పనిచేయట్లేదని రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు నిజమే నని వాటిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా మహాసంప్రోక్షణలు జరిగాయని అప్పుడు కొంత మంది భక్తులను అనుమతించేవారిని ఇప్పుడు ఎవ్వరిని అనుమతించటంలేదంటే వారు చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు ఈ తొమ్మిది రోజుల్లో వారు ఏదో చేయబోతున్నారని రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రోజా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయి. రోజా అన్నట్టు గతంలో కూడా మహాసంప్రోక్షణ జరిగింది కానీ  అప్పుడు రోజుకు కొంత మందిన భక్తులను అనుమతించేవారు. ఇప్పుడు టిటిడి బోర్డు ఏ ఒక్కరికి కూడా అనుమతి ఇచ్చేది లేదని చెబుతుంది. కొద్ది రోజుల క్రితమే టిటిడిలో వివాదాలు చెలరేగిన విషయం తెలిసిందే. రమణ దీక్షితులు టిటిడిపై పలు ఆరోపణలు చేశారు. శ్రీవారి ఆభరణాలు మాయమయ్యాయని అలాగే ప్రసాదం  పోటులో తవ్వకాలు జరిపారన్నారు. ముఖ్యమైన ప్రదేశాల్లో సిసి టివిలు పనిచేయడం లేదని టిటిడి మొత్తం అవినీతి మయమయిందని రమణ దీక్షితులు హాట్ వ్యాఖ్యలు చేశారు.

దేశంలోనే పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల దేవస్థానంలో వివాదాల పట్ల ఇప్పటికే పెద్ద చర్చ జరిగింది. టిటిడి బోర్డు భక్తులకు ఆగష్టు 9 నుంచి 17 వరకు దర్శనాన్ని నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయంతో ఈ చర్చ మరింత వేడెక్కింది. భక్తులు, విపక్షాల నుంచి వస్తున్న ఒత్తిడితోనైనా టిటిడి నిర్ణయం మార్చుకుంటుందా లేదా అనేది చూడాలి.