విశాఖపట్నం కేంద్రంగా సాగిన భూ కుంభకోణంలో సిట్ సంచలన విషయాలను బయటపెట్టింది. ఆరోపణలను ఎదుర్కొంటున్న మంత్రి, అధికారపార్టీ ఎంఎల్ఏల్లో ఎవరికీ ఎటువంటి సంబంధం లేదని, కుంభకోణంలో వైసిపి నేతదే కీకలపాత్రగా తేల్చేసింది. సిట్ విచారణ తీరుతెన్నులు చూసిన తర్వాత నివేదిక ఎలా ఉండబోతోందో ముందే అందరికీ అర్ధమైపోయింది. సిట్ నివేదికను మంత్రివర్గం ముందుంచంటం, దాని వివరాలను ప్రభుత్వం లీకుల రూపంలో బయటకు వదలటంతో అందరి అనుమానాలు నిజమే అని నిరూపితమైంది.
విశాఖపట్నం జిల్లాలో భీమిలీ తదితర నియోజకవర్గాల్లోని ప్రభుత్వ భూములు, పేదల భూములే లక్ష్యంగా భారీ కుంభకోణం జరిగింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొత్తల్లో వచ్చిన హుద్ హుద్ తుపానును అడ్డంగా పెట్టుకుని భూ రికార్డుల ట్యాంపరింగ్ జరిగింది. కుంభకోణంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంఎల్ఏలు పీలా గోవింద్, వెలగపూడి రామకృష్ణ, పల్లా శ్రీనివాస్, బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్, వాసుపల్లి గణేష, వంగలపూడి అనితతో పాటు అనేకమంది నేతలపై ఆరోపణలు వచ్చాయి.
భూకుంభకోణాన్ని ముందుగా అప్పటి మిత్రపక్షం బిజెపి ఎంఎల్ఏ విష్ణకుమార్ రాజు బయటపెట్టారు. దాంతో కలకలం మొదలైంది. తర్వాత సాక్ష్యాత్తు మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడే సహచర మంత్రి గంటా శ్రీనివాస్, ఎంఎల్ఏలపై మీడియా ముందు ఆరోపణలు చేయటంతో సంచలనం రేపింది. దాంతో ప్రభుత్వం 2017, జూన్ 2వ తేదీన సిట్ విచారణకు ఆదేశించింది. తర్వాత సిట్ విచారణలో జనాలు టిడిపి నేతలపై అనేక ఆరోపణలు చేశారు. నిష్పాక్షిక విచారణ డిమాండ్ తో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. విచాచరణలో మంత్రి చింతకాయల, ఎంఎల్ఏ విష్ణు తమ ఆరోపణలకు ఆధారాలను కూడా సిట్ అధికారులకు అందించారు.
దాదాపు ఏడాదిపాటు జరిగిన విచారణ నివేదికను సిట్ తొమ్మిది నెలల క్రితమే ప్రభుత్వానికి అందించింది. అయితే, ఇపుడే హఠాత్తుగా క్యాబినెట్ ముందుకు నివేదిక ఎందుకు తెచ్చారన్నదే ప్రశ్న. ఇంకో ఏడు నెలల్లో ఎన్నికల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో సిట్ నివేదికను తెరపైకి తేవటమే కాకుండా భూ కుంభకోణంలో వైసిపి కీలక నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రధాన పాత్రగా సిట్ చెప్పటం విచిత్రంగా ఉంది. 10 వేల ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు వ్యవహారంలో వివాదం నడుస్తోంది. దాదాపు రూ 3 వేల కోట్ల విలువైన ప్రభుత్వ, ప్రైవేటు భూ రికార్డులను ట్యాంపరింగ్ చేయించి మంత్రి, ఎంఎల్ఏల అనుచరుల పేర్లపై మార్చేశారన్నది ఆరోపణలు.
హుద్ హుద్ తుపాన్ వచ్చినపుడు చాలా వరకూ ప్రభుత్వ కార్యాలయాలు కూలిపోయాయి. చాలా రికార్డులు తడిసిముద్దయిపోవటంతో పాటు చాలా వరకూ కొట్టుకుపోయాయి. దాన్ని ఆసరాగా తీసుకుని టిడిపి నేతలు భారీ కుంభకోణానికి తెరలేపారు. కానీ సిట్ ఏమో ప్రతిపక్ష నేతతో పాటు ముగ్గురు కలెక్టర్లు, నలుగురు జాయింట్ కలెక్టర్లు, 10 మంది డిఆర్ఓలు, 14 మంది ఆర్డీఓలతో పాటు 100 మంది వివిధ స్ధాయిల్లోని అధికారులకు పాత్రుందని తేల్చింది. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా సిఫారసు చేయటం విడ్డూరంగా ఉంది.