మాది అవనిగడ్డ – మీది ఎర్రగడ్డ… పవన్ పై సింహాద్రి సిందులు!

రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా పొడిచిన పొత్తు అనంతరం జనసేన అధినేత వారాహి యాత్ర ప్రారంభించారు. ఇందులో భాగంగా… తాజాగా ఆదివారం రాత్రి అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు త్వరలో కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్న రేంజ్ లో ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమయలో పవన్ పై స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఫైరయ్యారు. ఎవరూ ఊహించని స్థాయిలో విమర్శలు గుప్పించారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ ఫైర్ అయ్యారు. జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అవనిగడ్డ కేంద్రంగా పవన్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే సింహ్రాది కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ తీరు చూస్తుంటే ముందు నుంచి ఆయనకు ఏమైనా పిచ్చి ఉందా? అనే అనుమానం కలుగుతుందని సందేహం వ్యక్తం చేశారు.

ఒకపక్క స్కిల్ స్కాంలో చంద్రబాబు అవినీతి చేయలేదని చెప్పటానికి న్యాయస్థానాలే సిద్ధంగా లేకుండా రిమాడ్ కు తరలిస్తే… పవన్ కల్యాణ్ డైలాగులు ఎవరిని సంతోషపెడతాయని ఆయన ప్రశ్నించారు. ఇదే సమయంలో కనీసం భీమవరంలో గెలవలేని వీరుడు.. ముఖ్యమంత్రిని ఏకవచనంతో పిలిచి గొప్పవాడిని అయిపోయానని అనుకోవడంకంటే పిచ్చి ఎక్కడైనా ఉంటుందా అని సందేహం వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో… అటు కేంద్ర ప్రభుత్వ ఐటీ, ఈడీ శాఖలు.. ఇటు రాష్ట్ర ప్రభుత్వ సీఐడీ.. ఈ మూడూ చంద్రబాబు ఎల్లో వైరస్ ను, వారి ల్యాబ్ లో చేసిన టెస్టుల్లో నిర్ధారిస్తున్నప్పటికీ… ఆ వైరస్ అంటే తనకెంతో ప్రేమ అని, తాను ఆ వైరస్ కోసమే బతుకుతున్నానని పవన్ చెప్పదలచుకున్నారని అర్ధమవుతుందని తెలిపారు.

ఇక.. ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఎప్పుడూ హైదరాబాద్ లోనే ఉండే ఈ అజ్ఞాతవాసి, అజ్ఞానవాసికి అసలు ఏపీతో ఉన్న సంబంధం ఏమిటో ముందు చెప్పాలని సింహాద్రి నిలదీశారు. అసలు ఏపీ ఇతని రాష్ట్రం ఎలా అవుతుందో ముందుగా చెప్పాలని ప్రశ్నించారు. అనంతరం… “మాది అవనిగడ్డ – మీది ఎర్రగడ్డ” అంటూ ఇచ్చిపడేశారు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్.

ఇతని తాపత్రయంలో అంతా… తన కులం ఓట్లని చంద్రబాబుకు వేయించాలి అనేదే తప్ప మరొకటి లేదని.. అందుకే ఈయనను ప్యాకేజీ స్టార్ అని అంటారని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో… మతిస్థిమితం లేని వారిని రోడ్ల మీద నిలబెట్టి అంతసేపు మాట్లాడించడం ఏమిటి? ఇంతకంటే తెలుగు ప్రజలకు దురదృష్టం ఉంటుందా? అని ప్రశ్నించారు! ఏది ఏమైనా… అవనిగడ్డ – ఎర్రగడ్డ మాటలు మాత్రం తాజాగా వైరల్ అవుతున్నాయి!