తెలంగాణ అధికారులదే తప్పని ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీ అంటోంది. కాదు కాదు, ఆంధ్రప్రదేశ్ అధికారులే రౌడీయిజం ప్రదర్శించారని తెలంగాణలోని అధికార బీఆర్ఎస్ అంటోంది.! రెండు తెలుగు రాష్ట్రాలకూ జీవనాధారం అయిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద అసలేం జరిగింది.?
నాగార్జున సాగర్, శ్రీశైలం తదితర నీటి ప్రాజెక్టులపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్యా నడుస్తున్న పొలిటికల్ గొడవ ఈనాటిది కాదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోక ముందు కూడా ఇదే పంచాయితీ, అప్పట్లో ప్రాంతాల మధ్య యాగీ.. ఇప్పుడేమో రాష్ట్రాల మధ్య గొడవ.. అంతే తేడా.!
అయినా, ఇరు రాష్ట్రాల పోలీస్ అధికారుల మధ్య గొడవేంటి.? సాగునీరు, తాగునీటికి సంబంధించిన అధికారుల రగడ ఏంటి.? విద్యుత్ శాఖ అధికారుల పంచాయితీ ఏంటి.. అదీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో ఎందుకీ రచ్చ.?
పొలిటికల్ మోటివిటీ లేకుండా, ఈ సమయంలో ఇంత రచ్చ జరిగే అవకాశమే లేదు. అధికార పార్టీల మెప్పుకోసం అధికారులు ఇలా దిగజారిపోయారని అనుకోవాలా.? లేదంటే, రాజకీయ లబ్ది కోసం అధికార పార్టీలే, ఈ పంచాయితీలో అధికారుల్ని బలిపశువుల్ని చేస్తున్నాయా.?
ఒక్క రోజు.. ఒకే ఒక్క రోజు సంయమనం పాటిస్తే, ఆ తర్వాత అది వేరే చర్చ. కానీ, సరిగ్గా ఎన్నికలకు ముందర.. అదీ పోలింగ్ ముందు రోజున యాగీ మొదలైందంటే.. కాస్త ఆలోచించాల్సిన విషయమే.
కాదేదీ రాజకీయానికి అనర్హం.! నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.? ఔను, ఇది నిస్సిగ్గు రాజకీయమే. ఈ రాజకీయం, తెలంగాణలో అధికార పార్టీ మీద సెంటిమెంట్ పండేలా చేస్తుందా.?