పవన్ కళ్యాణ్.! గెలిచి కదా, ఓడిస్తానని సవాల్ చేసేది.?

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పీఠమెక్కాలనుకుంటున్నారు. సరే, ఏ రాజకీయ పార్టీ అయినా.. అధికారంలోకి రావాలనే అనుకుంటుంది. కానీ, జనసేన ఆలోచనలు వేరు. ప్రజల్లో చైతన్యం తెస్తాం.. ప్రజలే గద్దెనెక్కేలా చేస్తాం.. అంటుంటారు జనసేనాని. అది సాధ్యమయ్యే పనేనా.?

రాజకీయ నాయకులు చెప్పే మాటలకీ.. చేసే చేతలకీ పొంతన వుండదు. ‘కాపు సామాజిక వర్గానికి రాజ్యాధికారం’ అంటూ జనసేనలోని కాపు సామాజిక వర్గ నేతలు నినదిస్తున్నారు. కాపు సామాజిక వర్గం కూడా ఆ దిశగా జనసేనకు అండగా నిలిచేందుకు సమాయత్తమవుతోంది. ఇది నాణేనికి ఓ కోణం.

2009 ఎన్నికల విషయానికొస్తే, అప్పట్లో చిరంజీవి మీద కాపు సామాజిక వర్గం చాలా ఆశలు పెట్టుకుంది. అందులో ఓ వర్గం చిరంజీవిని దెబ్బ కొట్టింది. ముఖ్యమంత్రి అవ్వాలన్న చిరంజీవి ఆశ నెరవేరలేదు. రెండు చోట్ల పోటీ చేస్తే ఓ చోట ఓడిపోయారు. సొంత గడ్డపై చిరంజీవి ఓటమి పాలయ్యారు.!

పవన్ కళ్యాణ్‌ది మరింత దారుణమైన పరిస్థితి. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. అందులో ఒకటి భీమవరం నియోజకవర్గం.. చిరంజీవి ఓడిపోయిన పాలకొల్లు నియోజకవర్గానికి పక్కనే వుంటుందిది. నాగబాబు కూడా నర్సాపురం నియోజకవర్గంలో ఓడిపోయారు.. అది లోక్‌సభ నియోజకవర్గం. పాలకొల్లు, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాలు రెండూ నర్సాపురం లోక్ సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి.

అంటే, మెగా కుటుంబాన్ని నర్సాపురం లోక్ సభ నియోజకవర్గ పరిధిలో, పాలకొల్లు అలాగే భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనం ఓడించారన్నమాట. ముందైతే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవాలి. ఆ తర్వాత ఎవర్నైనా ఓడిస్తానని భీష్మించుక్కూర్చోవాలి. తాజాగా ‘వైకాపాని గెలవనివ్వను’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలతో ఓ కార్టూన్ వదిలింది జనసేన. వైఎస్ జగన్ కింద పడితే.. పవన్ కళ్యాణ్ గోల్ వేస్తున్నారు.. 2014 ఎన్నిలకి. అదిగానీ, సెల్ఫ్ గోల్ కాదు కదా.?