ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు అత్యంత రసవత్తరంగా మారుతున్నాయి. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపిక అనేది మూడు ప్రధాన పార్టీలకూ అత్యంత కీలకంగా మారింది. ఈ సమయంలో అధికార వైసీపీ అభ్యర్థుల ఎంపికలో సర్వేఫలితాలు, ఎమ్మెల్యేల పనితీరు, సామాజిక సమీకరణాలు మొదలైన విషయాలను పరిగణలోకి తీసుకుంటున్న నేపథ్యంలో… తాజాగా ఎంపీ అభ్యర్థుల విషయం తెరపైకి వచ్చింది.
2019 ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నట్లుగానే 25 ఎంపీ స్థానాలకు గాను 22 ఎంపీలను గెలుచుకుని రికార్డ్ సృష్టించింది వైసీపీ. అసెంబ్లీలో 175కి 151 గెలుచుకోవడం ఒకెత్తు అయితే, 25 ఎంపీస్థానాల్లో 23 గెలుచుకోవడం మరొకెత్తు అనే మాటలు వినిపించాయి. అయితే 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తాజాగా ముగ్గురు సిట్టింగులను ఈదఫా పక్కన పెట్టింది.
ఇదే సమయంలో 9 స్థానాలకు కొత్త ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. అలాగే 3 ఎంపీ స్థానాలకు పాత అభ్యర్థులే దాదాపుగా రంగంలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో మిగిలిన 13స్థానాలకూ అభ్యర్థులు ఎవరయ్యే అవకాశం ఉందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ సమయంలో నరసాపురం లోక్ సభ స్థానం నుంచి దివంగత నటుడు కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి పేరు పరిశీలనలో ఉందని తెలుస్తుంది.
ఇప్పటివరకూ… శ్రీకాకుళం – పేరాడ తిలక్, విశాఖపట్నం – బొత్స ఝాన్సీలక్ష్మి, అరకు (ఎస్టీ) – భాగ్యలక్ష్మి, ఏలూరు – కారుమూరి సునీల్ కుమార్, విజయవాడ – కేశినేని నాని, కర్నూలు – గుమ్మనూరు జయరాం, తిరుపతి – కోనేటి ఆదిమూలం, హిందూపురం – జే. శాంతమ్మ, అనంతపురం – శంకర నారాయణ లను ఎంపీ అభ్యర్థులుగా ఎంపిక చేసింది వైసీపీ అధిష్టాణం.
ఇదే సమయంలో… గోరంట్ల మాధవ్ (హిందూపురం), కోటగిరి శ్రీధర్ (ఏలూరు), డాక్టర్ సంజీవ్ కుమార్ (కర్నూలు) లకు ఈదఫా టిక్కెట్ ఇవ్వలేదు! అదేవిధంగా… సిట్టింగుల్లో నందిగం సురేశ్ (బాపట్ల), పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి (రాజంపేట), వైఎస్ అవినాశ్ రెడ్డి (కడప) లకు రెండోసారి అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇక మిగిలిన 13మంది ఎంపీ అభ్యర్థుల్లో కీలకమైన నరసాపురం నియోజకవర్గంపై వైసీపీ దృష్టి సారించింది.
ఇందులో భాగంగా దివంగత నటుడు కృష్ణంరాజు భార్య, ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవితో వైసీపీ అధిష్టాణం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. నరసాపురం లోక్ సభ స్థానంలో విపక్ష కూటమి నుంచి రఘురామ కృష్ణంరాజు పోటీచేసే అవకాశం ఉన్న నేపథ్యంలో… ఈసారి ఎలాగైనా ఆర్.ఆర్.ఆర్.ని ఓడించాలని బలంగా ఫిక్సయ్యింది. దీంతో… శ్యామలాదేవి అయితే ఈ విషయంలో సరైన అభ్యర్థి అని వైసీపీ భావిస్తుంది.
మరి శ్యామలాదేవితో వైసీపీ అధిష్టాణం జరుపుతున్న చర్చలు సక్సెస్ అవుతాయా.. ఆమె నరసాపురం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారా.. లేదా, అనేది వేచి చూడాలి. ఇదే జరిగితే మాత్రం… వెస్ట్ లో వైసీపీకి తిరుగుండకపోవచ్చని అంటున్నారు పరిశీలకులు.