చంద్రబాబును ప్రజలు రక్షించుకోవాలా ?

ఓ ముఖ్యమంత్రిని ప్రజలే రక్షించుకోవాల్సిన దుర్గతి పట్టిందంటే ఆయన పరిస్ధితి ఎలాగుందో అర్ధం చేసుకోవచ్చు. మొన్నటి వరకూ మీకు అండగా నేనుంటాను అంటూ చంద్రబాబునాయుడు చెప్పేవారు. అలాంటిది ఎన్నికల తేదీ దగ్గరకు వస్తున్న కొద్దీ తనను మీరే రక్షించుకోవాలంటూ చంద్రబాబు బహిరంగంగా జనాలను వేడుకోవటాన్ని ఏ విధంగా అర్ధం చేసుకోవాలి ?

అంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీకి ఏ గతి పట్టనుందో చంద్రబాబుకు బాగా అర్ధమైపోతున్నట్లుంది. ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుండ చంద్రబాబు సభలకు జనాల స్పందన కూడా పెద్దగా ఉండటం లేదు. ఏదో మొక్కుబడిగా వివిధ ప్రాంతాల నుండి జనాలను తరలిస్తున్న విషయం అందరికీ తెలిసిపోయింది.

ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందుగా చంద్రబాబు ఎన్నో పథకాలను ప్రకటించారు. అయితే అవేవీ జనాలను పెద్దగా ఆకర్షించటం లేదన్నది వాస్తవం. పైగా జగన్మోహన్ రెడ్డి పథకాలను, హామీలను కాపీ కొట్టారంటూ చంద్రబాబు మీద సెటైర్లు కూడా మొదలయ్యాయి. దాంతో ఏమి చేయాలో అర్ధంకాక తెలుగుదేశంపార్టీ నేతల్లో టెన్షన్ పెరిగిపోయింది. దాంతో పథకాల ప్రకటనను విరమించుకున్నారు.

వైసిపిని గబ్బు పట్టించేందుకు చంద్రబాబు అండ్ కో ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా ఉపయోగం కూడా కనబడలేదు. అదే సమయంలో జగన్ సభలకు, రోడ్డు షోలకు జనాలు పోటెత్తుతున్నారు. దాంతో చంద్రబాబులో బేలతనం మొదలైపోయింది. అందుకనే రాబోయే ఎన్నికల్లో సీన్ అర్ధమైపోయే తనను రక్షించుకోవాల్సిన బాధ్యత జనాలదే అంటూ మొదలుపెట్టారు. మరి చంద్రబాబు అడుగుతున్నట్లు జనాలు చంద్రబాబు రక్షణకు నడుం బిగిస్తారా ?