ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యల వెనక ఉన్న మరో విస్తుగొలిపే కోణం వెలుగులోకి వచ్చింది. కిడారికి అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్న వ్యక్తే అతడి కదలికలను ఎప్పటికప్పుడు మావోలకు చేరవేసి కిడారి, సోమ హత్యకు కారణమయ్యాడు. కిడారిని బావా.. బావా అని నమ్మించి మృత్యు ముఖంలోకి నెట్టివేసినట్టు పోలీసులు చెబుతున్నారు.
డుంబ్రిగూడ మండలంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఆయన భార్య స్త్రీ, శిశుసంక్షేమ శాఖలో చిరుద్యోగిగా పనిచేస్తున్నారు. సోమకు దగ్గరి బంధువు అయిన ఆ రాజకీయ నాయకుడిని పావుగా వాడుకున్న మావోలు వారిని హత్య చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. భార్యాభర్తలిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇద్దరినీ వేర్వేరుగా, కలిపి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. లివిటిపుట్టులో పర్యటించిన మావోలకు వీరు ఆశ్రయం ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. అటవీ ప్రాంతంలో వారిని కలవడంతోపాటు ఆహారాన్ని కూడా వారికి అందించినట్టు సమాచారం.
సర్రాయిలో గ్రామ దర్శిని కార్యక్రమానికి కిడారి బయలుదేరారన్న సమాచారం ఆ నాయకుడి ద్వారానే మావోలకు చేరిందని పోలీసులు నిర్ధారించారు. ఇందుకు సంబంధించిన కాల్ డేటాను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. తనను చంపేస్తామని బెదిరించి లొంగదీసుకున్నట్టు ఆ నేత పోలీసుల విచారణలో చెప్పినట్టు సమాచారం. కిడారితో మాట్లాడి, హెచ్చరించి వదిలేస్తారని భావించానని, చంపేస్తారని మాత్రం అనుకోలేదని పేర్కొన్నారు. కావాలనే మావోలకు సహకరించారన్న పోలీసుల ప్రశ్నకు అతడు మౌనం దాల్చినట్టు తెలుస్తోంది.
కిడారి సర్వేశ్వరరావు, సోమల హత్య వెనక మూడు పార్టీలకు చెందిన గ్రామస్థాయి నేతలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాదు, వారందరికీ గతంలో మావోలతో సంబంధాలు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక కిడారి హత్యలో మరో పదిమంది గ్రామ స్థాయి నాయకులు కూడా సహకరించారన్న సమాచారంతో పోలీసులు వారిపైనా నిఘా వేశారు. దాదాపు 100 మందికి పైగా అనుమానితులను పోలీసులను విచారించారు. ఆరుగురి పాత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. త్వరలోనే నిందితులందరిని అరెస్ట్ చేయనున్నామని పోలీసులు తెలిపారు.