టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అమరావతి భూ కుంభకోణాలు యథేచ్ఛగా సాగించారని.. ఆయంతోపాటు అప్పటి మంత్రి పొంగూరు నారాయణతో కలిసి భూ దోపిడీకి పాల్పడ్డారని.. అమరావతిలో సీడ్ క్యాపిటల్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ పేరిట క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీఐడీ విచారణలో ఈ విషయంపై కోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది.
అవును… కృష్ణానది కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ జప్తు చేసేందుకు సీఐడీకి అనుమతి ఇస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ మేరకు ముందుగా లింగమనేని రమేష్ కి నోటీసు ఇవ్వాలని సూచించింది. నోటీసులిచ్చిన తర్వాత జప్తు చేయొచ్చని తెలిపింది. ఇదే సమయంలో మాజీ మంత్రి నారాయణ ఆస్తులను సైతం పాక్షికంగా జప్తు చేయడానికి కూడా కోర్టు సీఐడీకి అనుమతి ఇచ్చింది.
గతంలో ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ ను అటాచ్ చేయాలంటూ ప్రభుత్వం ఇటీవల జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే జప్తు చేసేందుకు అనుమతి కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఇరుపక్షాల వాదనలు విని తుది తీర్పు వెలువరించింది. గెస్ట్ హౌస్ జప్తుకి సీఐడీ అధికారులకు అనుమతి ఇచ్చింది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కరకట్ట గెస్ట్ హౌస్ వ్యవహారం తేల్చాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీ ప్రభుత్వం సీఐడీతో ఎంక్వయిరీ మొదలు పెట్టింది. సీఐడీ విచారణలో క్విడ్ ప్రోకో జరిగినట్టు గుర్తించడంతో ప్రభుత్వం తాజాగా ఆ గెస్ట్ హౌస్ ని అటాచ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఆ ఉత్తర్వులను అమలు చేసేలా తాజాగా ఏసీబీ కోర్టు సీఐడీకి అనుమతి ఇచ్చింది. దీంతో చంద్రబాబుకి భారీ షాక్ తగిలినట్టయింది.
ఈ కేసులో ఏ–1గా ఉన్న చంద్రబాబు కరకట్ట నివాసాన్ని అటాచ్ చేసేందుకు న్యాయస్థానం అనుమతినివ్వడంతోపాటు.. ఈ కేసులో ఏ–2గా ఉన్న పొంగూరు నారాయణ కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీల పేరిట అమరావతిలో ఉన్న 75,888 చదరపు గజాల ఇళ్ల స్థలాలు, భూ సమీకరణ కింద పొందిన కౌలు మొత్తం రూ.1.92 కోట్లను కూడా అటాచ్ చేసేందుకు న్యాయస్థానం ఆదేశించింది.
ఇదే సమయంలో ఆ ఆస్తుల అటాచ్ మెంట్ కోసం జులై 14 లోపు నోటీసులు జారీ చేయాలని ఆదేశించిన ఏసీబీ కోర్టు.. ఈ కేసులో పూర్తి స్థాయి అటాచ్ మెంట్ కోసం కేసు విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. దీంతో… అమరావతి భూ కుంభకోణం ద్వారా చంద్రబాబు, నారాయణ, వారి బినామీలు భారీగా అవినీతికి పాల్పడ్డారని నిగ్గుతేలినట్లే అని అంటున్నారు పరిశీలకులు. కాగా, అమరావతిలో చంద్రబాబు, నారాయణ సాగించిన భూ అక్రమాలను సిట్ నిర్ధారించిన సంగతి తెలిసిందే.