మహా కూటమిలో కొత్త ట్విస్ట్, కోదండరాం పార్టీ సంచలన నిర్ణయం

మహా కూటమిలో అప్పుడే విబేధాలు భగ్గుమన్నాయి. ఒకవైపు కూటమి ద్వారా పోటీ చేసి కేసిఆర్ కుటుంబ పాలన, రాచరిక పాలన అంతం చేస్తామని ప్రకటించిన కూటమిలో నామినేషన్ల పక్రియ దశలోనే లుకలుకలు బయటకొచ్చాయి. కూటమిలో పెద్దన్న పార్టీగా ఉన్న కాంగ్రెస్ తీరుతో సిపిఐ, తెలంగాణ జన సమితి విసిగి వేసారిపోయాయి. ఇక లాభం లేదనుకున్న తెలంగాణ జన సమితి తాను పోటీ చేయదలుచుకున్న 12 స్థానాలను ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ బిత్తరపోయే పరిణామాలు చోటు చేసుకున్నాయి.

టిజెఎస్ పో్టీ చేయబోతున్నట్లు ప్రకటించిన 12 స్థానాలివే

1 దుబ్బాక

2 మెదక్

3 మల్కాజ్ గిరి

4 అంబర్ పేట

5 వరంగల్ ఈస్ట్

6 మహబూబ్ నగర్

7 మిర్యాలగూడ

8 సిద్ధిపేట

9 జనగామ

10 ఆసిఫాబాద్

11 స్టేషన్ ఘన్పూర్

12 వర్దన్నపేట

కూటమిలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ తీరుతో కోదండరాం పార్టీ ఉక్కిరిబిక్కిరి అయింది. సీట్ల సంఖ్య తేల్చకుండా జన సమితిని కాంగ్రెస్ విసిగించింది, వేధించింది. నానబెట్టి నానబెట్టి సీట్ల సంఖ్య తేల్చినా తుదకు ఏ సీటు ఇస్తారో తేల్చకుండా పెండింగ్ లో పడేసింది. ఒకవైపు నామినేషన్ల ప్రక్రియ గడువు ముంచుకొచ్చినా ఇంకా కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు ప్రక్రియను ముగించలేదు. టిజెఎస్ కు ఏ సీటు ఇస్తారన్నదానిపై క్లారిటీ ఇవ్వలేదు.

దీంతో తీవ్ర ఆవేదనతోనే టిజెఎస్ తన స్థానాలను ప్రకటించుకున్నది. జనగామ విషయంలో తెలంగాణ జన సమితికి కాంగ్రెస్ కు మధ్య విబేధాలు వచ్చాయి. ఆ సీటులో సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బరిలో ఉన్నారు. కానీ ఆయనను పక్కనపెట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీంతో ఆయన భగ్గుమన్నారు. ఢిల్లీకి వెళ్లారు. రెడ్డి కూటమిగా మారబోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పిసిిిసి మాజీ అధ్యక్షుడికే సీటు ఇవ్వరా అని మండిపడ్డారు. బిసి సీటులో రెడ్డిని నిలబెడతారా అని నిలదీశారు. ఇది పార్టీకి మంచిది కాదన్నారు. 119 బిఫామ్ లు పంపిణీ చేసిన తనకు రెండు లిస్టులు రిలీజ్ అయినా బిఫామ్ రాకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

జనగామలో కోదండరాం పోటీ చేస్తే తమకు అభ్యంతరం లేదని కాంగ్రెస్ ముందుగా చెప్పింది. కానీ అక్కడ బిసి నేత ఉన్నందున ఆ సీటులో కోదండరాం పోటీకి వెనుకంజ వేశారు. కానీ ఆ సీటు జన సమితికి ఇస్తే ఎవరు పోటీ చేస్తారన్నది తేల్చుకుంటామని జన సమితి సూచించింది. కానీ కాంగ్రెస్ నుంచి స్పందన రాలేదు. బుధవారం సాయంత్రం వరకు కాంగ్రెస్ కు జన సమితి అల్టిమేటం ఇచ్చింది. కానీ కాంగ్రెస్ నేతలకు ఫోన్లు చేసినా స్పందించడంలేదని కోదండరాం అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ఈ పరిస్థితుల్లో టిజెఎస్ వేచి చూడలేక తాను పోటీచేయదలుచుకున్న స్థానాలను ప్రకటించింది. ఇందులో మహబూబ్ నగర్ ఇప్పటికే టిడిపి అభ్యర్థి ని ప్రకటించింది. కూటమిలో భాగంగా అక్కడ ఎర్రా శేఖర్ పోటీ చేస్తారని ప్రకటించారు. కానీ ఇప్పుడు టిజెఎస్ మహబూబ్ నగర్ సీటులో తాము పోటీ పెట్టబోతున్నట్లు తేల్చింది. 

అలాగే స్టేషన్ ఘన్పూర్ లో ఇందిర ను అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. కానీ అక్కడ కూడా టిజెఎస్ పోటీ పెడతామని తేల్చి పారేసింది. కాంగ్రెస్ పోటీ చేయబోతున్న ఆసిఫాబాద్ లోనూ పోటీ చేస్తానని స్పష్టం చేసింది. తన సీట్లను జన సమితి ప్రకటించుకుంటూనే పైగా తాము కూటమిలోనే కొనసాగుతామని తెలంగాణ జన సమితి నేతలు వెంకట్ రెడ్డి, ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వరరావు మీడియాకు వెల్లడించారు. తాము ప్రకటించిన ఈ 12 స్థానాలే అఫిషియల్ అని స్పష్టం చేశారు. ఒకవేళ ఈ స్థానాల్లో కూటమి పార్టీలు ఏవైనా అభ్యర్థులను ప్రకటిస్తే ఉపసంహరించుకోవాలని సూచించారు.

కాంగ్రెస్ నీతిని వారు సున్నితంగానే ఎండగట్టారు. కూటమిలో ఉంటామని ప్రకటిస్తూనే కాంగ్రెస్ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. మరి ఈ పరిణామం కాంగ్రెస్ వర్గాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.

ఒకవైపు టిఆర్ఎస్ పార్టీ ఫీల్డులో దూకుడు ప్రదర్శిస్తుంటే నామినేషన్ల ప్రక్రియ మొదలై ముగిసే వరకు కూడా కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు పక్రియను ముగించకపోవడం టిజెఎస వర్గాలను కలవరపాటుకు గురిచేస్తున్నది. ఏ సీటు ఇస్తారో తేల్చకుండా టిజెఎస్ పార్టీని ఇంటి నుంచి బయట కాలు పెట్టకుండా కాంగ్రెస్ చేస్తున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే తమ దారి తాము చూసుకుంటామన్నట్లు అభ్యర్థులను ప్రకటించారు.

సిపిఐ కూడా ఇదే తరహాలో ఆందోళన చెందింది. మూడు సీట్లే ఇస్తామని సిపిఐ నేతలకు కాంగ్రెస్ చెప్పింది. సిపిఐ ఐదు కోరింది. మధ్యలో నాలుగు అయినా వస్తాయని సిపిఐ ఆశించినా లాస్టుకు మూడుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. హుస్నాబాద్, వైరా, బెల్లంపల్లి సీట్లు దక్కాయి. కొత్తగూడెం, దేవరకొండ, మునుగోడు కూడా అడిగినా ఆ పార్టీకి మొండిచేయి చూపింది కాంగ్రెస్.