విపక్షాలకు కొత్త టెన్షన్… సెర్ప్ క్లారిటీ ఆన్ పెన్షన్!

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ సమయంలో పార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తించేస్తున్నాయి. ఈ సమయంలో ఇప్పటికే “మేమంతా సిద్ధం” అంటూ వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్రను ప్రారంభించారు. మరోపక్క చంద్రబాబు “ప్రజా గళం”.. ఇంకో రెండు రోజుల్లో పవన్ కల్యాణ్ “వారాహి యాత్ర”. ఈ సమయంలో ఒక కీలకమైన చర్చ ఏపీ రాజకీయాల్లో మొదలైంది. అదే… పెన్షన్ పంపిణీ!

ఏపీలో విపక్షాలకు ఉన్న అతిపెద్ద సమస్యల్లో వాలంటీర్లు కూడా ఒకటనే సంగతి తెలిసిందే. వాలంటీర్లపై అటు చంద్రబాబు, ఇటు లోకేష్, మరోపక్క పవన్ లతో పాటు టీడీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాని – ప్రభుత్వ పథకాల లబ్ధి దారులకూ మధ్య వారధులుగా ఉన్న వలంటీర్లపై తీవ్ర విమర్శలు చేశారు. ఇంకా బలంగా చెప్పలాంటే.. ఇంగితం మరిచి కామెంట్స్ చేశారు!

ఇంట్లో మగాళ్లు లేనప్పుడు ఇళ్లకు వెళ్లే ఉద్యోగం అని, గోనె సంచులు మోసే ఉద్యోగం అని ఒకరంటే… మహిళలను హ్యూమన్ ట్రాఫికింగ్ కి పాల్పడుతున్నారని మరొకరు మాట్లాడారు. ఈ క్రమంలో తాజాగా… వాలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చారు మరొకరు! ఈ సమయంలోనే టీడీపీ అధినేత సన్నాయి నొక్కులు నొక్కడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా… వాలంటీర్లకు జీతాలు పెంచుతామని చెప్పుకొచ్చారు!

ఆ సంగతి అలా ఉంటే… తాజాగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఏప్రిల్, మే నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో సామాజిక పింఛన్ల పంపిణీ ఎవరు చేపడతారనే విషయంలో తీవ్ర గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. మరోపక్క ఈ రెండు నెలలూ పెన్షన్ ని సచివాలయాలకు వెళ్లి తీసుకునేలా చర్యలు చేపట్టాలని.. వాలంటీర్లను పంపకుడదని టీడీపీ సానుభూతిపరులుగా ముద్రపడిన కొంతమంది వ్యక్తులు ఎన్నికల కమిషన్ ను కోరారు కూడా!

దీంతో… ఎప్పటిలాగే వాలంటీర్లే పెన్షన్ ఇళ్లకు తీసుకొచ్చి ఇస్తారని కొందరంటే… ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆ అవకాశం లేకుండా కొంతమంది అడ్డుకుంటున్నారని, కాళ్లు ఈడ్చుకుంటూ సచివాలయాలకు వెళ్లి తెచ్చుకోవాల్సిందే అని మరొకరు అన్నారు. ఈ సమయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్) క్లారిటీ ఇచ్చింది.

ఇందులో భాగంగా… ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెన్షన్స్ పంపిణీకి బ్యాంకుల నుంచి నగదు తీసుకునివెళ్లే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు ఆథరైజేషన్ పత్రాలు తీసుకోవాలని సెర్ఫ్ తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. వీరికి ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులు.. ఆథరైజేషనల్ లెటర్స్ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ నేప‌థ్యంలో రాబోయే రెండు నెల‌లు పెన్ష‌న్లు వారితోనే పంపిణీ చేయించబోతున్నారన్నమాట!

దీంతో ఇప్పుడు ఈ విషయం విపక్షాలకు అతిపెద్ద సమస్యల్లో ఒకటిగా పరిణమించిందనే కామెంట్ల్ వినిపిస్తున్నాయి! ఏప్రిల్ నెలలో సరే కానీ.. మే నెలలో మరో పదిరోజుల్లో పోలింగ్ ఉందనగా.. వాలంటీర్లు ఇంటికి పట్టుకెళ్లి పెన్షన్ ఇస్తే ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుందని భావిస్తున్నారంట. అదే జరిగితే… కోడ్ లో కూడా అధికారికంగా ప్రచారం చేసినట్లే అవుతుందని వాపోతున్నారంట. మరి వారి నెక్స్ట్ స్టెప్ ఏమిటనేది వేచి చూడాలి!