నెల్లూరు టిడిపిలో కలకలం

అవును నెల్లూరు తెలుగుదేశంపార్టీలో సీనియర్ నేత, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి కేంద్రంగా కలకలం మొదలైంది. దాదాపు రెండు నెలలుగా  పార్టీ కార్యక్రమాల్లో అంటీ ముట్టనుండటంతో ఆదాల మనసులో ఏముందో నేతల్లో ఎవరికీ అర్ధంకాక గందరగోళంలో పడ్డారు. ఆమధ్య చంద్రబాబునాయుడు సమక్షంలో జరిగిన సీనియర్ నేతల సమావేశంలో నెల్లూరు ఎంపిగా ఆదాల పోటీ చేస్తారని ప్రకటించారు. తర్వాత నెల్లూరుకు వచ్చి తన మద్దతుదారులతో జరిగిన సమావేశంలో ఆదాల అదే విషయాన్ని వివరించారు. అయితే ఆ తర్వాత ఏమైందో ఎవరికీ అంతుపట్టటం లేదు. పార్టీ కార్యక్రమాలకు దాదాపు దూరంగా ఉంటుంన్నారు. దాంతో రేపటి ఎన్నికల్లో ఆదాల పోటీ చేసే విషయంలో అయోమయం మొదలైంది.

నిజానికి ఎంపిగా పోటీ చేయటం ఆదాలకు ఏమాత్రం ఇష్టం లేదు. నెల్లూరు రూరల్, సర్వేపల్లి నియోజకవర్గాల్లో పోటీపై బాగా ఆశక్తి చూపారు. అందులో భాగంగానే పై నియోజకవర్గాల్లో ఆదాల విస్తృతంగా పర్యటించేవారు. అయితే, సర్వేపల్లిలోను, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పోటీ  చేయటానికి ఆదాలకు అవకాశం లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో తన పాత్ర లేకుండా ఎంపిగా పోటీ చేయించటంపై మంత్రులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాత్ర ఉందని అనుమానిస్తున్నారు. ఎందుకంటే, ఇద్దరు మంత్రులతోను ఆదాలకు సఖ్యత లేదు. కాబట్టి తెరవెనుక రాజకీయం చేసి తనను ఇబ్బందులు పెడుతున్నట్లుగా అనుమానిస్తున్నారు.

అదే సమయంలో పార్టీ కార్యక్రమాల్లో కూడా తనను పెద్దగా భాగస్వామ్యం చేయటం లేదని సమాచారం. పార్టీ కార్యక్రమాలకు ఆదాలను నేతలు పిలవటం లేదట. అంతేకాకుండా ఎక్కడైనా జిల్లాలోని ముఖ్యనేతల సమావేశం జరుగుతున్నా ఆదాలకు అసలు సమాచారమే ఉండటం లేదట. ఇవన్నీ చూసిన తర్వాత వ్యూహం ప్రకారమే తనను కొందరు నేతలు కావాలనే దూరం పెడుతున్నారనే అనుమానం ఆదాలలో పెరిగిపోయింది. అందుకనే తాను కూడా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా ఇంట్రెస్టుగా పాల్గొనటం లేదు.

ఇది వరకూ పార్టీ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా బాగా యాక్టివ్ గా పాల్గొనేవారు. అప్పటితో పోల్చుకుంటే ఇపుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లే లెక్క. ఎవరైనా నేతలు వచ్చి తనను కలిస్తే మాట్లాడుతున్నారు లేకపోతే లేదట. తనంతట తానుగా చొరవ తీసుకుని నేతల దగ్గరకు వెళ్ళి కలుస్తున్నది కూడా లేదట. అందుకనే ఆదాల రాజకీయ భవిష్యత్తుపై జిల్లా టిడిపిలో పెద్ద చర్చ జరుగుతోంది. బహుశా వైసిపిలో చేరుతారేమో అనే ప్రచారం కూడా జరుగుతోంది. షెడ్యూల్ ఎన్నికలకు ముందు ఆదాల విషయంలో జరుగుతున్న ప్రచారంతో టిడిపిలో ఆందోళన పెరిగిపోతోంది.