ఇటీవల చంద్రబాబు నాయుడు తీసుకున్న పెద్ద నిర్ణయాల్లో పార్టీ పదవుల కేటాయింపు కూడ ఒకటి. కరోనా కారణంగా చంద్రబాబు హైదరాబాద్లోనే ఉండిపోవడంతో ఆరు నెలలు తెలుగుదేశం స్తబ్దుగా ఉండిపోయింది. అందుకే శ్రేణుల్లో గొప్ప కదలిక తీసుకురావాలనే ఉద్దేశ్యంతో చంద్రబాబు పార్లమెంట్ ఇంఛార్జ్ పదవులంటూ ప్రతి లోక్ సభ నియోజవర్గానికి ఒక నాయకుడ్ని అపాయింట్ చేశారు. చాలాకాలం తర్వాత చంద్రబాబు చేపడుతున్న కార్యక్రమం కావడంతో శ్రేణులంతా ఎంతో ఆసక్తిగా వ్యవహారాన్ని తిలకించారు. మంచి నాయకులకు పగ్గాలిస్తే పట్టు తప్పిన పార్టీ పట్టాలెక్కుతోంది ఆశపడ్డారు. అయితే చంద్రబాబు సెలక్ట్ చేసిన ఇంఛార్జుల్లో నెట్టెం రఘురామ్ కూడ ఒకరు.
ఈయన ఎంపికను అస్సలు ఎవ్వరూ ఊహించలేదు. నెట్టెం రఘురామ్ పేరు ప్రకటించబడగానే ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎందుకంటే కొన్నేళ్లుగా ఆ పేరు ఎక్కడా వినిపించలేదు కాబట్టి. నెట్టెం రఘురామ్ ఒకప్పుడు కృష్ణాజిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత. కానీ గత ఐదారేళ్లుగా ఆయన సైలెంట్ అయిపోయారు. పార్టీ అధికారంలో ఉండగా కూడ ఆయన ఊసు వినబలేదు. జగ్గయ్యపేట నియోజకవర్గం నుండి రఘురామ్ వరుసగా 1985, 89, 94 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. మంత్రిగా పనిచేశారు కూడ. కానీ ఉన్నట్టుండి ఆయన్ను పక్కనపెట్టేశారు చంద్రబాబు. మళ్ళీ ఏ ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేసింది లేదు.
పార్టీ పావుల్లో కూడ లేరు. దీంతో నియోజకవర్గంలోని ఆయన కేడర్ కూడ కొత్త నాయకుడ్ని వెతుక్కుంది. జగ్గయ్యపేట ఓటర్లు కూడ ఆయన్ను దాదాపు మర్చిపోయారు. ఆయన స్థానంలో కొత్త లీడర్లు తయారయ్యారు. సీనియర్ నాయకులు సైతం రఘురామ్ అవసరంలేదని స్థితికి వెళ్లిపోయారు. అలాంటిది చంద్రబాబు ఇప్పుడు ఆయనను వెతికే తవ్వితీసి పార్టీ విజయవాడ పార్లమెంటరీ ఇంఛార్జ్ భాద్యతలను అప్పగించారు. ఇంకెవరూ లేరన్నట్టు రిటైర్ అయ్యే స్టేజిలో ఉన్న నేతను తీసుకొచ్చి మీద రుద్దండం పార్టీ నేతలకు నచ్చలేదు. అందుకే ఆయనకు ఎవ్వరూ సహకరించట్లేదట.
ఇంఛార్జ్ బాధ్యతలు తీసుకున్నాక నాయకులను కలిసి కార్యాచరణ రెడీ చేసుకోవాలని అనుకున్నారు రఘురామ్. అనుకున్నట్టే విజయవాడ పార్టీ కార్యాలయంలో మీటింగ్ పెట్టుకున్నారు. కేశినేని నాని, దేవినేని ఉమ, నాగుల్ మీరా లాంటి సీనియర్ నాయకులు ఆయన మాటను పట్టించుకోలేదు. నెట్టెం ఏర్పాటుచేసిన సమావేశాలకు ఒక్కరంటే ఒక్కరు కూడ హాజరుకాలేదు. దీంతో చేసేది లేక ఆయన వెనుదిరిగి వెళ్లిపోయారు. పాత లీడర్ ఏం చేస్తాడులే అనుకున్నారో ఏమో లేకపోతే ఉమ పాత మనస్పర్థలను గుర్తుచేసుకున్నారో తెలీదు కానీ ఆయనకు సహకారం అందించడానికి ఎవ్వరూ ముందుకురావట్లేదు. ఫలితంగా ఇంతవరకు రఘురామ్ ఇంఛార్జ్ బాధ్యతల్లో చేసిందేమీ లేదు.