గత ఎన్నికల్లో వైసీపీ తరపున కొత్త వ్యక్తులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచారు. వారిలో కొందరు ఊహించని రీతిలో దూసుకుపోతున్నారు. మొదటిసారి దక్కిన అవకాశాన్ని నూటికి నూరు శాతం వినియోగించుకుంటున్నారు. వాటిలో పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు ఒకరు. ఎన్నికల్లోకి అడుగుపెట్టిన మూడేళ్ళలోనే ఆయన మంత్రి స్థాయికి వెళ్లిపోయారు. అది అసామాన్య రీతిలో కావడం విశేషం. శ్రీకాకుళం జిల్లా అంటేనే తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. జిల్లాలోని ప్రముఖమైన కుటుంబాలు అన్నీ దాదాపు తెలుగుదేశం వైపే ఉన్నాయి. అలాంటి కుటుంబాల్లో గౌతు కుటుంబం కూడ ఒకటి. రాష్ట్రంలో ఈ కుటుంబానికి గొప్ప చరిత్ర ఉంది. కుటుంబ పెద్ద గౌతు లచ్చన్న 30, 40 ల దశకంలో స్వాతంత్య్ర ఉద్యమమలో కీలకంగా వ్యవహరించారు. పలు రాజకీయ సంస్థలతో, జాతీయ స్థాయి నాయకులతో కలిస్ పనిచేశారు.
రాజకీయంగా శ్రీకాకుళం జిల్లాకు ఒక గుర్తింపు తెచ్చిన నేత ఆయన. రాష్ట్ర స్థాయిలో అన్ని రకాల ఎన్నికల్లోనూ వరుస విజయాలు సాధించిన ఘనత ఆయనది. సోంపేట నియోజకవర్గం నుండి 1948 నుండి 83 వరకు వరుసగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన చరిత్ర కూడ ఉంది. ఆయన తర్వాత ఆయన కుమారుడు గౌతు శ్యామ్ సుందర్ శివాజీ కూడ శ్రీకాకుళం రాజకీయాల్లో గొప్పగానే రాణించారు. సోంపేట నుండి ఐదుసార్లు, పలాస నుండి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో ఆయన కుమార్తె గౌతు శిరీషను పలాస నుండి పోటీకి సింపగా వైసీపీ అభ్యర్థి సీదిరి అప్పలరాజు చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పలరాజు రాజకీయాల్లోకి వచ్చిన రెండేళ్లలోపే ఈ విజయాన్ని సాధించారు. అది కూడ గౌతు కుటుంబం మీద కావడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.
అయితే ఆ గెలుపుతోనే ఆయన ఆగిపోలేదు. మత్స్యకార వర్గానికి చెందిన ఆయనకు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మంత్రి పదవి దక్కింది. మొదటిసారి శ్రీకాకుళం నుండి మత్స్యకార వర్గానికి అంతటి ప్రాధాన్యం లభించింది అప్పలరాజు రూపంలోనే. అప్పలరాజు కూడ వన్ టైమ్ వండర్ అన్నట్టు కాకుండా లాంగ్ టైమ్ పొలిటికల్ కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నారు. మంత్రిగా జిల్లాకు చేయవలసిన పనులన్నీ చేస్తున్నారు. ఎవ్వరితోనూ వివాదాల్లేవు. అచ్చెన్నాయుడు లాంటి ప్రత్యర్థులకు ధీటైన సమాధానం ఇస్తున్నారు. ఇక గౌతు కుటుంబమైతే ఆయన ధాటి ముందు నిలవలేకున్నారు. గౌతు శిరీష రాజకీయం అప్పలరాజు ముందు సాగట్లేదు. శ్యామ్ సుందర్ శివాజీ సైతం అప్పలరాజు స్పీడుకు కళ్లెం వేయలేకున్నారు. ఆయనలో ఎలాంటి తప్పుల్నీ పట్టలేక జనంలోకి రాలేకున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే జిల్లాలో గౌతు కుటుంబాన్ని జనం మర్చిపోయేలా కనిపిస్తున్నారు.