తాను సీఎం అయ్యాక చేసిన గొప్ప పనుల్లో గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ చాలా గొప్పవని వైఎస్ జగన్ భావిస్తుంటారు. వైసీపీ నేతలు కూడ ఈ వాలంటీర్ వ్యవస్థతో రాష్ట్ర స్వరూపమే మారిపోతోందని, ఇలాంటి గొప్ప పని చరిత్రలో ఎవరూ చేయలేదని చెప్పుకుంటుంటారు. ప్రధాని మోదీ సైతం ఈ వ్యవస్థను ప్రశంసించారు. మొన్నీమధ్యనే ఈ వ్యవస్థ ఏర్పాటుచేసి ఏడాది గడిచినందుకుగాను జగన్ సహా అధికార పార్టీ నేతలంతా తాడేపల్లి నుండి చప్పట్లు కొట్టి పరస్పర అభినందనలు తెలుపుకున్నారు. బయటికి కనిపించే వ్యవహారం ఇలా ఉంటే లోపల మాత్రం రియాలిటీ వేరుగా ఉంది.
సచివాలయ, వాలంటీర్ వ్యవస్థల వలన జనం ప్రయోజనం పొందుతున్నా ఆ పని చేస్తున్న ఉద్యోగులు మాత్రం తెగ కష్టాలు పడుతున్నారట. రేషన్, పింఛన్ ఇలా ప్రభుత్వ పథకాలన్నింటినీ ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు నానా తంటాలు పడుతున్నారు. షిఫ్ట్ పని గంటలు తక్కువే అయినా చేయాల్సిన పని మాత్రం కొండంత ఉంటుందని, ఎండా, వాన తేడా లేకుండా తిరగలేక అవస్థలు పడుతున్నామని, ఇక కరోనా సమయంలో అయితే పట్టించుకున్నవారే లేరని వాపోతున్నారు. తాజాగా సచివాలయ ఉద్యోగుల అటెండెన్స్ 10 లోపు వేసేయాలి రూల్ పెట్టారు.
ఈ రూల్ మేరకు సచివాలయ స్టాఫ్ అంతా 10 లోపు సచివాలయంలో ఫింగర్ ప్రింట్ వేసేయాలి. లేదంటే ఆరోజు గైర్హాజరు కిందే లెక్క. దీన్ని కష్టంగా భావిస్తున్నారు ఉద్యోగులు. అయినా సర్దుకుపోతున్నారు. కానీ ఇదే రూల్ మండల అధికారులకు ఎందుకు పెట్టలేదని అడుగుతున్నారు. వాళ్ళకొక రూల్ మాకొక రూలా. అందరికీ ఒకటే కదా ఉండాలి. మమ్మల్ని వెట్టి చాకిరీకి పెట్టుకున్నట్టే ఉంది. మాక్కూడా ఓటు హక్కు ఉంది. టైమ్ వచ్చినప్పుడు మా ప్రతాపం చూపిస్తాం అంటూ మండిపడుతున్నారట.