టీడీపీకి రజనీకాంత్ వల్ల లాభమెంత.?

స్వర్గీయ ఎన్టీయార్ శత జయంతి వేడుకకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన స్వర్గీయ ఎన్టీయార్ శత జయంతి కావడంతో సినిమా పరమైన విషయాలతోపాటు, రాజకీయ అంశాలూ ప్రస్తావించారు ఆ కార్యక్రమంలో రజనీకాంత్.

గతంలో.. అంటే, స్వర్గీయ ఎన్టీయార్‌కి రాజకీయంగా చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన సమయంలోనూ, ఇదే రజనీకాంత్ అప్పట్లో చంద్రబాబు వెంట వున్నారు. అప్పటికీ, ఇప్పటికీ.. టీడీపీతో రజనీకాంత్‌కి అటాచ్మెంట్ ఏమీ లేదు. కానీ, చంద్రబాబుకి రజనీకాంత్ స్నేహితుడట.

చంద్రబాబుపై రజనీకాంత్ ప్రశంసలు గుప్పించడం వైసీపీకి నచ్చలేదు. ఇదో అర్థం పర్థం లేని నచ్చకపోవడం. అంతే మరి, ఆయనెవరో వచ్చి.. చంద్రబాబుని పొగిడితే, వైసీపీకి ఏంటి నష్టం. వైసీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. దాంతో, విషయం చిరిగి చాటంత అయ్యింది. వైసీపీ అభాసుపాలయ్యింది.

ఇక, ఈ వివాదంతో టీడీపీకి లాభమెంత.? అసలు టీడీపీ ఎందుకు ఈ అంశాన్ని ఇంకా ఇంకా పెంచి పోషిస్తోంది.? రాజకీయంగా వాడుకుంటోంది.? వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున రజనీకాంత్‌తో ఎన్నికల ప్రచారం ఏమైనా చేయిస్తుందా.?

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రజనీకాంత్ ద్వారా బీజేపీతో స్నేహానికి చంద్రబాబు వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తున్నారనీ, బీజేపీకీ – టీడీపీకీ మధ్య రజనీకాంత్ మధ్యవర్తిత్వం చేస్తున్నారనీ తెలుస్తోంది. అదే వైసీపీ ఆగ్రహానికి కారణం అన్నది ప్రముఖంగా వినిపిస్తున్న వాదన. నిజమేనా.? నిజమే అయి వుండొచ్చు.!