ఏటా సంక్రాంతి పండుగను తన సొంత ఊరిలో జరుపుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలవాటు. గతంలో ఎప్పుడూ లేదు గానీ, 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాతే ఆయన ఈ ఆనవాయితీని పెట్టుకున్నారు.
ఈ సారి కూడా చంద్రబాబు కుటుంబం ఆదివారం మధ్యాహ్నం నారావారి పల్లెకు చేరుకుంది. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు, మంత్రి లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ ఆదివారం నారావారి పల్లెలో సందడి చేశారు. చంద్రబాబు ఇంకా తన సొంత ఊరికి రాలేదు.
ఆదివారం రాత్రికి గానీ, సోమవారం ఉదయం గానీ ఆయన వస్తారని చెబుతున్నారు. నందమూరి బాలకృష్ణ, ఆయన భార్య వసుంధర కూడా సోమవారమే వస్తారని తెలుస్తోంది. భువనేశ్వరి, బ్రాహ్మణి దేవాన్ష్‌తో కలిసి గ్రామంలో పర్యటించారు.
సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు, పిల్లలకు ఆటల్లో పోటీలను నిర్వహించారు. విజేతలకు బహుమతులను అందజేశారు. చంద్రబాబు కుటుంబం రాకతో నారావారి పల్లెలో పండుగ కళ నెలకొంది.