సజ్జలగారూ.! మీరు కూడానా.?

సకల శాఖ మంత్రి.. అనే గుర్తింపు వున్న వైసీపీ కీలక నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల్ని లైట్ తీసుకున్నారు. ‘మెజార్టీ సీట్లు మేమే గెలిచాం కదా.?’ అంటున్నారాయన. పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్లు కోల్పోయారు కదా.? అంటే, ‘ఆ ఓటర్లకు సంక్షేమ పథకాలు అందలేదేమో..’ అంటూ చాలా తేలిగ్గా వ్యాఖ్యానించారు సజ్జల.

‘సార్వత్రిక ఎన్నికలపై ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం వుండదు’ అని సజ్జల రామకృష్ణా రెడ్డి చెబుతోంటే, నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు వైసీపీ శ్రేణులకి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయమై వైసీపీ చాలా చాలా కష్టపడింది. కింది స్థాయిలో కిందా మీదా పడింది కూడా.! కొన్ని చోట్ల ఏడో తరగతి ఫెయిల్ అయినోళ్ళకీ ఓటు హక్కు వచ్చేలా చేయగలిగారు. దొంగ ఓట్ల సంగతి సరే సరి.!

అసలు ఇదంతా అవసరమా.? ‘వై నాట్ 175 అని ముఖ్యమంత్రి అంటోంటే.. ఈ కక్కుర్తి ఎందుకు.?’ అన్న చర్చ వైసీపీ వర్గాల్లోనే జరిగింది. నిజమే, వైఎస్ జగన్ సంక్షేమ పాలన విషయంలో జనానికి పెద్దగా అభ్యంతరాల్లేవు. కానీ, స్థానికంగా వైసీపీ నేతలు.. అందునా, ప్రజా ప్రతినిథుల పట్ల తీవ్ర వ్యతిరేకత వుంది.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. ఇది వైసీపీకి, వైసీపీ ప్రభుత్వానికీ తీవ్ర హెచ్చరికగానే భావించాలి. కానీ, ‘వీటిని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు’ అంటున్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి. పార్టీ కష్ట కాలంలో వుందని గుర్తించడం తెలివైన నాయకుడి లక్షణం. ముఖ్యమంత్రి ఎంత కష్టపడుతున్నా, పార్టీలో మిగతా నాయకులు లైట్ తీసుకుంటే ఫలితాలు ఇలాగే వుంటాయ్. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఇతర నేతలు.. ఎవరూ ఎమ్మెల్సీ ఎన్నికల్ని సీరియస్‌గా తీసుకున్నట్టు లేదు. అందుకే ఈ దుష్ఫలితం.