సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అలా మాట్లాడితే ఎలా సామీ.!

ప్రభుత్వ సలహాదారు అంటే ఎలా వుండాలి.? అన్ని విషయాలపైనా అవగాహన వుండాలి. సకల శాఖల మంత్రి.. అనే గుర్తింపు వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డికి వుందిగానీ.. ఒక్కోసారి ఆయన చేసే వ్యాఖ్యలు వైసీపీని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటాయి.

వైఎస్ షర్మిల విషయంలో సజ్జల చేసిన వ్యాఖ్యలు కావొచ్చు, సీపీఎస్ రద్దు విషయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడారని సజ్జల చెప్పినప్పుడు కావొచ్చు.. సజ్జల వైసీపీలో రేపిన ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. అసలు సజ్జలకు ఏ కోణంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించారు.? అన్నదానిపై ఇలాంటి సందర్భాల్లోనే అనుమానాలు కలుగుతుంటాయి.

తాజాగా, జనసేన మీద విమర్శలు చేసే క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి లాజిక్కుని మిస్సయ్యారు. ‘ఏ రాజకీయ పార్టీ అయినా, ధైర్యంగా ఎన్నికల్ని ఫేస్ చేయాలనుకుంటే పొత్తులు పెట్టుకోడు..’ అంటూ జనసేన మీద సెటైర్లు వేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.

రాజకీయాల్లో పొత్తులు సర్వసాధారణం. ఇది బహిరంగ రహస్యమే. అక్కడికేదో పొత్తులు పెట్టుకోవడం నేరమంటే ఎలా.? పొత్తులు అన్నిసార్లూ ఆయా పార్టీలకు కలిసి రావు. కొన్నిసార్లు, రాజకీయ పొత్తులే, రాజకీయ పార్టీలకు శాపంగా మారుతుంటాయి కూడా.

ఆ విషయం పక్కన పెడితే, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నేతగా వున్న సమయంలో, అప్పట్లో కాంగ్రెస్ పార్టీ, వామ పక్షాలతో పొత్తు పెట్టుకుంది. ఆ లెక్కన, వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ‘నాయకుడు’ అని సజ్జల గుర్తించనట్టేనా.? ఈ ప్రశ్న జనసేన నుంచి వస్తోంటే, వైసీపీ శ్రేణులు సమాధానం చెప్పలేకపోతున్నాయి.