సజ్జల అస్సలు ఒప్పుకోవట్లేదంతే.!

వైసీపీ కీలక నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీతో కలిసే ఎన్నికలకు వెళతారన్నది సజ్జల రామకృష్ణారెడ్డి ఉవాచ.

‘చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయడానికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రాజకీయాల్లో వున్నారు..’ అంటూ పదే పదే వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మచ్చని చెరిపేసుకోవడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారా.? అంటే అదీ లేదు.

పైగా, ‘వైసీపీతో పోల్చితే, టీడీపీ కాస్త బెటర్..’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు జనసేన అధినేత. ‘మేం, గతంలో టీడీపీని కూడా ప్రశ్నించాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కూడా ప్రశ్నించిన వ్యక్తిని నేను. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ పాలనకి చరమగీతం పాడాలంటే.. ఏం చేయాలన్నదానిపై ఆలోచిస్తున్నాం. అలా ఆలోచించినప్పుడు, వైసీపీ కంటే టీడీపీ బెటర్ అనే నిర్ణయానికి రాక తప్పలేదు..’ అని జనసేన అధినేత చెప్పుకొచ్చారు.

అయితే, జనసేన అధినేత ఏం మాట్లాడినా, ఆయన మాత్రం టీడీపీ కోసమే పనిచేస్తున్నారనీ, టీడీపీతో కలిసి వెళ్ళడం తప్ప, జనసేనకు ఇంకో ఆప్షన్ లేదని సజ్జల రామకృష్ణారెడ్డి సహా పలువురు వైసీపీ నేతలు తెగేసి చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్, చంద్రబాబు.. కలిసినా వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదన్నది సజ్జల రామకృష్ణారెడ్డి ఉవాచ. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లనూ గెలుచుకోవడంపై తాము దృష్టిపెట్టామనీ, విపక్షాలు ఉనికి కోసం ఆరాటపడుతున్నాయనీ సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు.

మొత్తమ్మీద, రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఎన్నికల వాతావరణాన్ని ముందే సృష్టించేస్తున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు.