వైఎస్ జగన్, షర్మిల మధ్య ‘సజ్జల’ చిచ్చు.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ, ఆయన సోదరి వైఎస్ షర్మిలకీ మధ్య ‘చిచ్చు’ పెట్టింది సజ్జల రామకృష్ణారెడ్డేనంటూ సోషల్ మీడియా వేదికగా ఓ చిత్రమైన చర్చ జరుగుతోంది. వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టాలనుకున్నప్పుడు ఆమెను ‘వద్దని’ వారించామంటూ కొన్నాళ్ళ క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించిన విషయం విదితమే. షర్మిలకు రాజకీయంగా వైఎస్సార్సీపీ నుంచి ఎలాంటి మద్దతూ వుండబోదని కూడా సజ్జల ప్రకటించేశారు. వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఓ ‘పవర్ సెంటర్’గా ఎదిగారన్నది నిర్వివాదాంశం. ఆయన ప్రభుత్వ సలహాదారుగా పనిచేస్తున్నారు కూడా. అయితే, సజ్జల.. వైఎస్ జగన్ కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటారని అనుకోలేం. మరి, షర్మిల.. సజ్జల తీరుపై ఎందుకు అసహనం చేసినట్లు.? అది కూడా టీడీపీ అనుకూల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కావడం కొత్త చర్చకు తెరలేపింది. ‘రామకృష్ణరెడ్డి అన్న, వైసీపీతో సంబంధం లేదు.. అని నా గురించి అన్నారు.. ఆ మాటలు నాకు బాధ వేశాయి..’ అంటూ షర్మిల వ్యాఖ్యానించారు.

అతే కాదు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడానికి తన శక్తికి మించి కష్టపడ్డాననీ షర్మిల చెప్పుకున్నారు. నిజానికి, షర్మిల పార్టీ వ్యవహారంపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించినరోజే ఆయన మీద తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ‘ఆ విషయం చెప్పాల్సింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. సజ్జల రామకృష్ణారెడ్డికి మాట్లాడే హక్కు లేదు..’ అంటూ వైఎస్సార్ అభిమానులు చాలామంది సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. కానీ, చాలా సున్నితమైన అంశం కావడం, అప్పటికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీలు షురూ అవడంతో.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేరుగా స్పందించే పరిస్థితి లేదు. ఆ కారణంగా సజ్జల మీడియా ముందుకొచ్చారు. అయితే, సజ్జల వ్యాఖ్యల్ని పూర్తిగా తప్పు పట్టలేం, అలాగని సమర్థించలేం. కానీ, ఎప్పుడైతే షర్మిల, సజ్జల పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడు తనను బాధపెట్టారని అన్నారో.. ఆ తర్వాతి నుంచీ సజ్జల, వైసీపీ అభిమానుల దృష్టిలో కార్నర్ అయిపోయారు.. అన్నా చెల్లెళ్ళ మధ్య చిచ్చుపెట్టారనే అపప్రధ మోయాల్సి వస్తోందిప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి.