ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం.. ఈ అంశం గత కొంతకాలంగా వివాదాస్పదమవుతూ వస్తోంది. తెలంగాణ రాజధాని హైద్రాబాద్‌లోనూ సీఎం క్యాంప్ కార్యాలయం చుట్టూ అనేకానేక వివాదాలు నడిచాయి, నడుస్తూనే వున్నాయి.!
నిజానికి, ముఖ్యమంత్రి భద్రత అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యంత కీలకమైన అంశం. ఈ క్రమంలోనే, భద్రతా కోణంలో క్యాంప్ కార్యాలయానికి అదనపు హంగులు కల్పించడం అనేది తప్పనిసరి. ఇక, క్యాంప్ కార్యాలయంలో వుండాల్సిన వసతుల గురించి కొత్తగా చెప్పేదేముంది.?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం చుట్టూ పెద్ద రచ్చే జరుగుతోంది. ప్రస్తుతానికైతే, వైఎస్ జగన్ ఇల్లే, క్యాంప్ కార్యాలయం. తాడేపల్లిలో వుంది ఆ ఇల్లు. రాజధాని అమరావతి పరిధిలోకే వస్తుంది ఆ తాడేపల్లి ప్రాంతం.
అయితే, గతంలో అమరావతికి మద్దతిచ్చిన వైఎస్ జగన్, ముఖ్యమంత్రి అయ్యాక మాట మార్చి, అమరావతిని కాదని విశాఖ వైపు మొగ్గు చూపుతున్నారు. మూడు రాజధానులంటూ పూర్తి గందరగోళాన్ని సృష్టించారు. అందులోంచి కర్నూలుని పూర్తిగా పక్కన పడేశారనుకోండి.. అది వేరే చర్చ.
త్వరలో విశాఖకు వెళ్ళిపోనున్నారు వైఎస్ జగన్. అందుకే, అక్కడ రుషికొండపై క్యాంప్ కార్యాలయాన్ని నిర్మించుకున్నారు. నిజానికి, ఇది వైఎస్ జగన్ సొంత భవనం కాదు. ప్రభుత్వ ఆస్తి. పర్యాటక శాఖ ఈ భవనాల్ని నిర్మిస్తోంటే, వాటిని ముఖ్యమంత్రి కార్యాలయం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకోనుంది.
పేరుకే పర్యాటక శాఖ, పర్యాటక భవనాలు.! నిజానికి, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కోసమే అక్కడ నిర్మాణాలు జరిగాయి. ఆ విషయం నేరుగా ఒప్పుకోవడానికి వైసీపీకి ధైర్యం చాలడంలేదు. కొండని తొలిచేశారు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇదీ నిజమే.! అవసరమా ఇదంతా.? ఇంతా చేసి, ఈ భవనాల వల్ల ఒరిగేదేంటి.? గుండు సున్నా.!
అటువైపుగా వెళ్ళేవాళ్ళకి, ‘అవసరమా ఇదంతా.?’ అన్న భావన సహజంగానే కలుగుతోంది. మొండి పట్టుదలకుపోయి, ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను వైఎస్ జగన్ ఎందుకు పెంచుకుంటున్నారో ఏమో.!