రుషికొండ రహస్యం.! అక్కడేం జరుగుతోంది.?

విశాఖపట్నంలో అసలేం జరుగుతోంది.? రుషికొండలో ఏం నిర్మితమవుతోంది.? ఈ విషయమై ప్రభుత్వ వాదన ఒకలా వుంటే, వైసీపీ వాదన ఇంకోలా వుంది. చిన్నపాటి మానవ తప్పిదమంటూ, తాము చేసిన ట్వీటుని సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.

మూడు రాజధానుల అంశం ఇప్పుడు మాటలకే పరిమితం. చేతల్లో ముందడుగు వేయడానికి వీల్లేదు. సో, రుషికొండలో సెక్రెటేరియట్ భవనాలు కడుతున్నట్లు చెప్పడానికి ఆస్కారమే లేకుండా పోయింది. కానీ, వైసీపీ శ్రేణుల్లో అదే చర్చ జరుగుతోంది. కొండ మీద సెక్రెటేరియట్ ఏంటి.? అంటే, మినీ సెక్రెటేరియట్.. అంటున్నారు.

కాదు కాదు, జస్ట్ క్యాంప్ కార్యాలయం మాత్రమే. అధికారులకు అందుబాటులో కొన్ని భవనాలు.. అనేది మరో వాదన. ఇవేవీ కాదు, పర్యాటక శాఖ నిర్మిస్తున్న భవనాలని వైసీపీ తరఫున, అలాగే ప్రభుత్వం తరఫున ప్రకటనలు వస్తున్నాయి. ఇంతకీ, ఏది నిజం.? అది మాత్రం ఎవరికీ అర్థం కావడంలేదు.

వందల కోట్లే ఖర్చవుతున్నాయక్కడ.. భవనాల నిర్మాణం కోసం. కొండని తొలిచేస్తున్నారు.. భవనాలు కట్టేస్తున్నారు. కానీ, అక్కడే ఎందుకు.? అంటే, దానికి మళ్ళీ సమాధానం దొరకదు. ఇంతా చేసి, వచ్చే ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి రాకపోతే.?

వైనాట్ 175 అని వైసీపీ పైకి చెప్పొచ్చుగాక. కానీ, ఈక్వేషన్స్ మారిపోతున్నాయ్. 2024 ఎన్నికల్లోపు రిషికొండ నిర్మాణాలు అందుబాటులోకి రాకపోవచ్చు. ఆమాత్రందానికి ఇంత సీక్రెసీ వైసీపీకి ఎందుకు.? అందరికీ అనుమానాలు కలిగేలా ‘అతి’ ఎందుకు.?