కొంతమంది రాజకీయ నాయకులు చెప్పే మాటలు, ఇచ్చే స్టేట్ మెంట్లూ వింటే.. వారి ముందు హాస్యనటులు అనవసరం, వారి ముందు మహా మహా రచయితలు దిగదుడుపు అన్నట్లుగా అనిపిస్తుంటుంది. జనాలకు ఏమీ తెలియదు అని అనుకుంటారో.. లేక, ఆత్మవంచన తాలూకు లక్షణాలో తెలియదు కానీ.. తాజాగా సూపర్ డూపర్ జోక్ పేల్చారు పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు!
తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ… “వచ్చే ఎన్నికలకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సిద్ధం చేస్తున్నాం.., ప్రస్తుతం వైసీపీకి కాంగ్రెస్ భయం పట్టుకుంది” అనేశారు. రుద్రరాజు అక్కడితో ఆగారనుకుంటే పొరపాటే సుమా… సీఎం జగన్ ను, ప్రతిపక్ష నేత చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్ధితిలో లేరని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 100 సీట్లు గెలుస్తుందని చెప్పుకొచ్చారు.
అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, సోనియా గాంధీ అత్యంత శక్తిమంతురాలిగా ఉన్నప్పుడే బెరకని జగన్.. ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ ఉన్న పరిస్థితికి, ఆ పార్టీని చూసి బయపడుతున్నారనడం జోక్ కాక మరేమిటి?
నోటాతో పోటీపడి బయటపడాలని భావించే స్థితిలో ఉన్న పార్టీకి… 151 సీట్లతో అధికారంలో ఉన్న జగన్ పార్టీ భయపడిపోవడం ఏమిటి… ఎన్ని సీట్లలో పోటీచేస్తారో కూడా గత్యంతరం లేని కాంగ్రెస్ పార్టీ ఏకంగా 100 సీట్లు గెలవడం ఏమిటి?
దీంతో… వచ్చే ఎన్నికల్లో కనీసం ఎన్ని స్ధానాల్లో డిపాజిట్ వస్తాయో చెప్పాలని కొందరు.. నోటాను దాటితే కాంగ్రెస్ గెలిచినట్లేనని మరికొందరు.. రుద్రరాజు గారు మెలువగానే ఉన్నారన్న విషయం ఆయన గ్రహించాలని మరికొందరు.. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు!