మంత్రి, ఎంఎల్ఏల మధ్య కొత్త పంచాయితీ

ఉన్న పంచాయితీలు చాలవన్నట్లు కర్నూలు జిల్లాలో కొత్త పంచాయితీ మొదలైంది. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాదా సంపాదనా మార్గాలనుకున్న వాటిని వేటినీ టిడిపి ప్రజాప్రతినిధులు వదలటం లేదు. అందుకనే వివాదాలు పెరిగిపోతున్నాయి. తాజాగా నంద్యాల పట్టణానికి సమీపాన ఉన్న మహానంది మండలంలో ఎర్రమట్టి తవ్వకాలు, అమ్మకాల కోసం పోటీ పెరిగిపోయి చివరకు ఫిరాయింపు మంత్రి అఖిలప్రియ, ఎంఎల్ఏ బుడ్డా రాజశేఖర రెడ్డి మధ్య గొడవలు ముదిరిపోయాయి. చివరకు గొడవలు ఏ స్ధాయికి చేరుకున్నాయంటే మంత్రి మద్దతుదారులపై ఎంఎల్ఏ ఏకంగా విజిలెన్స్ విభాగానికే ఫిర్యాదు  చేశారట.

 

విషయం ఏమిటంటే మహనంది మండలంలో ఇటుకలు బట్టీల సుమారు 500 దాకా ఉన్నాయి. ఇటుకల తయారీ అంటే ఎర్రమట్టి అవసరం కదా ? అందుకని బుడ్డా అనుచరులు మండలంలో ఎక్కడపడితే అక్కడ ఎర్రమట్టిని తవ్వేసుకుంటున్నారు. ఆ విషయం మంత్రి అఖిలప్రియకు తెలియగానే మంత్రి అనుచరులు కూడా రంగంలోకి దిగేశారు.

 

మంత్రి మద్దతుదారులు ఓ పొలంలో ఎర్రమట్టిని తవ్వుకుంటున్న విషయం ఎంఎల్ఏకి తెలియగానే అభ్యంతరాలు మొదలయ్యాయి. మంత్రి అనుచరులను మట్టి తవ్వుకోనీకుండా అడ్డుకున్నారు. దాంతో రెండు వర్గాలకు గొడవైంది.

 

తన నియోజకవర్గంలో తాను తప్ప ఇకెవరూ మట్టిని తవ్వుకునేందుకు లేదని ఎంఎల్ఏ అంటున్నారు. అయితే, యజమానితో తాము అగ్రిమెంటు చేసుకున్న కారణంగా లీజుకు తీసుకున్న పొలంలో తాము ఎర్రమట్టి తవ్వుకుంటే అడ్డు చెప్పటమేంటని మంత్రి మద్దతుదారులు అడ్డం తిరిగారు. ఈ గొడవ పెద్దదయ్యేటప్పటికి చివరకు ఎంఎల్ఏ మంత్రి మద్దతుదారులపై విజిలెన్స్ శాఖకు ఫిర్యాదు చేశారు.

 

దాంతో ఓ రోజు విజిలెన్స్ సిబ్బంది దాడులు చేసి మంత్రి మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలియగానే మంత్రి తెరవెనుకనుండి కేసులు పెట్టదంటూ విజిలెన్స్ అధికారులపై ఒత్తిడి పెడుతున్నారట. మొత్తానికి కొత్తగా మొదలైన ఈ పంచాయితీ చివరకు ఎంత దాకా వెళుతుందో ఏమో ?