పాదయాత్ర ముగింపు అదిరింది

దాదాపు 14 నెలల క్రితం మొదలైన పాదయాత్ర కన్నా ముగింపే అదిరిపోయింది. 2017, నవంబర్ 6వ తేదీన కడప జిల్లాలోని ఇడుపులపాయలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను మొదలుపెట్టారు. అప్పట్లో చిన్న పాయగా మొదలైన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసే సమయానికి జన సముద్రమైపోయింది. సరే ముగింప సభ కాబట్టి ఏదోలే జనాలు వచ్చారని అనుకోవచ్చు. కానీ తర్వాత ఇచ్ఛాపురం నుండి రైలులో రేణిగుంటకు జగన్ చేరుకునే సమయానికి రైల్వేస్టేషన్లో చుట్టుపక్కలంతా జనాలే. అక్కడి నిం తిరుపతికి చేరుకునే సమయానకి చెప్పాల్సిన అవసరమే లేదు. పద్మావతి అతిధి గృహంలో బయలుదేరి అలిపిరి వద్దకు చేరుకునే సమయానికి జనాలతో కిక్కిరిసిపోయింది.

అలిపిరి నుండి తిరుమలకు జగన్ పాదయాత్ర ద్వారా చేరుకున్నారు. జగన్ తో పాటు తిరుమలకు వేలాదిమంది నడిచారు. తర్వాత వెంకటేశ్వరస్వామి దర్శనం అయిన తర్వాత రాత్రి బస చేసి మరుసటి రోజు ఉదయం కారులో కడప జిల్లాకు బయలుదేరారు. ఇక అక్కడి నుండి దారిపోడవునా జనమే జనం. తిరుపతి నుండి కడపకు మామూలుగా అయితే రెండున్నర గంటలో చేరుకోవచ్చు కారులో. కానీ జగన్ కు మాత్రం సుమారు 7 గంటలు పట్టింది. తిరుపతి-కడప మధ్యలో ప్రతీ గ్రామం వద్ద, ప్రతీ మండల కేంద్రంలోను విపరీతమైన జనాలు.

కడప జిల్లాలో ఎంటరైన దగ్గర నుండి పులివెందులకు చేరుకోవటానికి జగన్ కు కనీసం నాలుగు గంటలకుపైగా పట్టింది. అక్కడి నుండి ఇడుపులపాయకు చేరుకునేటప్పటికి మరో నాలుగు గంటలు పట్టింది. కడపలోను, వేంపల్లి మండల కేంద్రం నుండి ఇడుపులపాయకు జగన్ చేరుకునే సమయానికి శుక్రవారం అర్ధరాత్రి దాటిపోయింది. 14 మాసాల తర్వాత జిల్లాలోకి అడుగుపెట్టిన జగన్ కు స్వాగతం పలకటానికి ఎక్కడికక్కడ జనాలు విపరీతంగా పోటెత్తారు. దాంతో షెడ్యూల్ కన్నా ప్రయాణం గంటలపాటు ఆలస్యమైపోయింది.  దాంతో పాదయాత్ర ప్రారంభంకన్నా ముగింపే అదిరిపోయిందనే చెప్పాలి.