ఏపీలో కొత్త నినాదం: హాయ్‌ ఏపీ.. బైబై బీపీ!

ఎన్నికలకు ఇంకా సుమారు 9 నెలలు సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటినుంచే రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. ఇందులో భాగంగా… ప్రధాన్ ప్రతిపక్షం టీడీపీ కంటే ఎక్కువగా జనసేన దూకుడు పెంచుతుంది. దీంతో వైసీపీ వర్సెస్ జనసేన రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఈ క్రమంలో పవన్ ఒక నినాదం ఇవ్వగా.. దానికి కౌంటర్ నినాదం ఇస్తున్నారు మంత్రి ఆర్కే రోజా.

నిన్నమొన్నటివరకూ అనారోగ్యం కారణంగా మీడియాకు కాస్త దూరంగా ఉన్న రోజా… “ఆఫ్టర్ స్మాల్ గ్యాప్.. డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ” మైకులముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… “హలో ఏపీ.. బైబై వైసీపీ.. ఇదే మన నినాదం” అంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇచ్చిన పిలుపుకు కౌంటర్ వేశారు. “హాయ్‌ ఏపీ.. బైబై బీపీ (బాబు, పవన్‌)” అనే నినాదాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రజలు అందుకుంటారని రోజా సెటైర్ వేశారు.

ఈ సందర్భంగా పవన్ పైనా చంద్రబాబుపైనా తీవ్ర విమర్శలు చేశారు రోజా. ఎన్నికల గుర్తులేదు, జిల్లా అధ్యక్షులు లేరు, 175 స్థానాల్లో అభ్యర్థులు లేరు.. అయినా సీఎం జగన్‌ ను తరిమేస్తానని పవన్ కల్యాణ్‌ చెప్పడం విడ్డూరంగా ఉందని రోజా అన్నారు.

అనంతరం చంద్రబాబుపై ఫైరయిన ఆమె… ఆయన్ను నమ్మే పరిస్థితిల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరని స్పష్టం చేశారు. స్లోగన్స్ దగ్గర నుంచి మేనిఫెస్టో వరకు అంతా కాపీ కొడుతున్నారని.. బుర్ర పెట్టి కొత్తగా ఆలోచించే సత్తా వీరికి లేదని ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో.. “మీరు కలిసి వచ్చినా, విడివిడిగా వచ్చినా నాకు భయం లేదు” అని తెలిపారు. తనకు ఆరోగ్య సమస్య వస్తే జనసేన సైకోలు అనవసరంగా కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, పవన్.. ఒక రోజు సీఎం అవుతాను అంటాడు.. మరో రోజు ఎమ్మెల్యే కావాలి అంటాడు.. ఇప్పుడు గెలవలేను అంటున్నాడు.. అని రోజా సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే.