కాంగ్రెస్ కు చంద్ర గ్రహణం..లగడపాటి ఓ బ్రోకర్

మూడు రాష్ట్రాల్లో సొంతంగానే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణా ఎన్నికల్లో మాత్రం ఎందుకు చతికిలపడింది ? ఎందుకంటే, అందుకు వైసిపి ఎంఎల్ఏ రోజా ఓ సమాధానం చెప్పారు. అదేమిటంటే, తెలంగాణాలో కాంగ్రెస్ కు చంద్రబాబునాయుడు రూపంలో చంద్రగ్రహణం పట్టిందట. అందుకే మధ్యప్రదేశ్, రాజస్ధాన్, ఛత్తీస్ ఘఢ్ రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో మాత్రం రాకపోవటానికి ప్రధాన కారణం చంద్రబాబే అంటూ మండిపడ్డారు. మహాకూటమి ఏర్పాటు ద్వారా తెలంగాణాలో పాగావేద్దామని అనుకున్న చంద్రబాబుకు తెలంగాణా ఓటర్లు గట్టిగా బుద్ది చెప్పారట.

 

లగడపాటి గురించి మాట్లాడుతూ రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన లగడపాటి మళ్ళీ బ్రోకర్ పనులు ఎందుకు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కెటియార్, లగడపాటి మధ్య జరిగిన వాట్సప్ చాటింగ్ చూసిన తర్వాత అందరికీ లగడపాటి ఓ బ్రోకర్ అన్న విషయం అర్ధమైపోయిందన్నారు. తీసుకున్న వేల కోట్ల రూపాయల అప్పులు కట్టలేక ఎగొట్టేందుకే లగడపాటి మహాకూటమికి అనుకూలంగా సర్వేలంటూ హడావుడి చేసినట్లు చెప్పటం నిజమే అయ్యుండొచ్చు.

 

నందమూరి ఫ్యామిలికి చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచినట్లు మండిపడ్డారు రోజా. ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం లేని సుహాసినిని ఓడిపోయే కుకట్ పల్లి సీటులో పోటీలోకి దింపటం ద్వారా నందమూరి హరికృష్ణ ఫ్యామిలినీ చంద్రబాబు ఘోరంగా దెబ్బ కొట్టినట్లు చెప్పారు. హరికృష్ణ ఫ్యామిలిపై చంద్రబాబుకు అంత ప్రేమే ఉంటే ఏపిలోనే ఎంఎల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుని ఉండొచ్చు కదా ? అంటూ నిలదీశారు. మరీ రోజా ప్రశ్నకు టిడిపి ఏమి సమాధానం చెబుతుందో చూడాలి.

 

తెలంగాణాలో ఓటర్లు ఇచ్చిన తీర్పే ఏపి ఎన్నికల్లో కూడా పునరావృతమవుతుందని రోజా ఆశించారు. డబ్బులకు, మీడియా మ్యానేజ్ మెంట్ ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురిచేద్దామని చంద్రబాబు చేసిన ప్రయత్నాలన్నింటినీ ఓటర్లు చిత్తు చేశారట. రానున్న ఏపి ఎన్నికల్లో ఓటర్లు తెలంగాణా తీర్పునే స్పూర్తిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేయటం గమనార్హం. హోలు మొత్తం మీద చంద్రబాబు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే, నందమూరి కుటుంబంపై సానుభూతి చూపటం ద్వారా జూనియర్ ఎన్టీయార్, కల్యాణ్ రామ్ ల అభిమానుల మనసులను గెలుచుకునేందుకు రోజా ప్రయత్నిస్తున్న విషయం అర్ధమవుతోంది.