అర్థమైందా రాజా… వాయించి వదిలిన మంత్రి రోజా!

మంత్రి రోజా నియోజకవర్గం నగరిలో సీఎం జగన్ పర్యటించారు. ఈ కార్యక్రమంలో జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా ఏప్రిల్‌–జూన్‌ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యా­ర్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ను సీఎం జగన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా రోజా చేసిన ప్రసంగం హాట్ టాపిక్ గా మారింది.

నగరి సభలో మైకందుకున్న మంత్రి రోజా చెలరేగిపోయారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి నగరికి వచ్చేసిన ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. నగరి నియోజకవర్గానికి సీఎం జగన్‌ రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ సమక్షంలోనే రజనీకాంత్ “జైలర్” సినిమా డైలాగులతో పవన్ కళ్యాణ్, లోకేష్ ను టార్గెట్ చేశారు.

ఈ సందర్భంగా… “మొరగని కుక్క లేదు.. విమర్శించని నోరు లేదు.. ఈ రెండు లేని ఊరే లేదు..” అంటూ రోజా గట్టిగా డైలాగ్ పేల్చారు. అనంతరం ఇదే డైలాగును తమిళంలోనూ చెప్పిన రోజా… “అర్ధమైందా రాజా” అంటూ ముగించారు. దీంతో సభ మొత్తం ఆగకుండా చప్పట్లతో దద్దరిల్లిపోయింది.

ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ఎంత విమర్శించినా… లోకేష్ ఎంత మొరిగినా.. చంద్రబాబు నాయుడు ఊరూరా తిరిగి ఎన్ని అబద్దాలు చెప్పినా… ఈ రాష్ట్ర ప్రజలు మంచి చేసిన జగనన్నను మరిచిపోరని రోజా బలంగా చెప్పిన రోజా… “ట్వంటీ ట్వంటీఫోర్… జగనన్న వన్స్ మోర్” అంటూ నినదించారు.

అనంతరం.. ఇంటర్లో తాను ఏ గ్రూపు చదివాడో కూడా పవన్ కళ్యాణ్ కు తెలియదని రోజా సెటైర్ వేశారు. ఇదే సమయంలో… బైపీసీ చదివితే ఇంజనీర్ అవ్వొచ్చని చంద్రబాబు అంటారని, అటువంటి పవన్ – చంద్రబాబు లకు కూడా విద్యా కానుక ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు.

ఇదే క్రమంలో వైఎస్‌ జగన్‌ ను ఓడించేవాడు ఇంకా పుట్టలేదని చెప్పిన రోజా… జగన్‌ ను ఓడించాలంటే అవతలివైపు కూడా జగనే ఉండాలని పంచ్ డైలాగులు పేల్చారు. ఎమ్మెల్యేగా గెలవలేని వాడు వైఎస్‌ జగన్‌ ను ఎలా ఓడిస్తాడని ఈ సందర్భంగా ప్రశ్నించారు.

ఈ సందర్భంగా చంద్రబాబుకు మంత్రి రోజా సవాల్‌ విసిరారు. కుప్పంలోప్రతి ఇంటికి సంక్షేమం అందించిన ఘనత సీఎం జగన్‌ దేనని పేర్కొన్నారు. కుప్పంలో జరిగిన అన్ని ఎన్నికల్లో టీడీపీ చతికిలబడిందని చెప్పిన రోజా… వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. వారంటీ లేని చంద్రబాబు షూరిటీ ఇస్తే గ్యారెంటీ ఉంటుందా అని మండిపడ్డారు.

ఇదే సమయంలో… “ఆటో డ్రైవర్‌ కూతురు ఆటో మొబైల్‌ ఇంజనీరింగ్‌ చేస్తోంది. రైతు బిడ్డ వ్యవసాయ శాస్త్రవేత్త చదువుతున్నాడు. ఒక మెకానిక్‌ కొడుకు మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చేస్తున్నాడు. కంపౌండర్‌ కూతురు డాక్టర్‌ చదువుతున్నారంటే అది ముమ్మాటికీ సీఎం జగన్‌ వల్లే.. అన్న పార్టీలో ఒక సైనికురాలిగా ఉన్న గర్వపడుతున్నాం” అంటూ రోజా ఎమోషనల్ అయ్యారు!

Minister Roja Says Rajinikanth Dialogue | CM Jagan | Pawan Kalyan | Chandrababu| Nagari| @SakshiTV ​