ఏపీలో టీడీపీ – బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ కలిసే ఉండాలని కోరుకునే ఒక వర్గం మీడియాకు గతకొంతకాలంగా మనసు మనసులో లేదని అంటున్నారు విశ్లేషకులు. మరిముఖ్యంగా కన్నా లక్ష్మీనారాయణను ఏపీ బీజేపీ చీఫ్ గా తొలగించినప్పటినుంచీ ఈ బాధ మరింత తీవ్రతరం అయ్యిందని అంటున్నారు.
దీనికితోడు సోము వీర్రాజుని ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించేసరికి అదికాస్తా పుండుమీద గొడ్డుకారం చల్లినంత పనైందనేది పలువురి అభిప్రాయం. అయితే ఈ సమయంలో తాజాగా సోము వీర్రాజుని ఆ పదవి నుంచి తప్పిస్తూ.. ఆ స్థానంలో పురందేశ్వరిని నియమిస్తూ హస్తినలోని బీజేపీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. దీంతో… ఆదివారం ముచ్చటతో రెడీ అయిపోయారు ఆర్కే!
ఇందులో భాగంగా… సోము వీర్రాజుపై ఉన్న కసంతా తీర్చేసుకునే పనికి పూనుకున్నారు. అవును… కన్నా లక్ష్మీనారాయణను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మార్చటమే అగ్రనేతలు చేసిన తప్పని మొదలుపెట్టిన ఆయన.. ఒకవేళ మార్చినా సోము వీర్రాజును నియమించటం ఇంకా తప్పని.. ఒకవేళ నియమించినా ఇంతకాలం కంటిన్యూ చేసుండకూడదని అభిప్రాయపడింది. అంటే తనకున్న బాదనంతటినీ బహిరంగంగా వ్యక్తం చేసేపనికి నిరభ్యంతరంగా పూనుకుంది.
కారణం ఏమిటంటే… వీర్రాజు నాయకత్వంలో పార్టీ ఏ రకంగా కూడా బలోపేతం కాలేదట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… కన్నా లక్ష్మీనారయణ ఏపీ బీజేపీ చీఫ్ గా ఉండగా కూడా పార్టీ బలోపేతం అయిపోయిన సందర్భం ఏదీ లేదు. అధ్యక్షుడి హోదాలో నరసరావుపేట ఎంపీగా పోటీ చేస్తే.. కన్నాకు వచ్చిన ఓట్లు 15 వేలు. కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయిన కెపాసిటి కన్నా సొంతం.
ఇక కాపు సామాజికవర్గంలో బలమైన నేతగా చెప్పే కన్నా… ఆ సామాజికవర్గం పరంగా అయినా ఏపీబీజేపీని పైకి లేపిందేమీ లేదు. కాకపోతే.. జగన్ పై ఉన్న వ్యక్తిగత ఆక్రోశాన్ని పార్టీ భుజంపై పెట్టి కాలేచారు. అది ఒక వర్గం మీడియాకు శ్రవణానందకరములుగా ఉండేవి. అంతకుమించి ఏపీ బీజేపీకి కన్నా చేసిందేమీ లేదు. వీర్రాజు ఏదో చేయలేదు అని బాదపడిపోవడానికి!
దీంతో… చంద్రబాబు పేరిచెబితే అంతెత్తున లేచి పడిపోయే వీర్రాజును మాత్రం ఏపీ బీజేపీ చీఫ్ పదవి నుంచి తప్పించడం… ఆర్కే వంటి వారికి కాస్త సంతోషాన్ని ఇచ్చిందనేది సారాంశం.
ఈ సందర్భంగా ఇప్పుడు ఏపీ బీజేపీ చీఫ్ గా మారిన దగ్గుబాటి పురందేశ్వరి ఏ మేరకు పార్టీని పైకిలేపుతారో అదీ చూద్దాం అంటూ కామెంట్లు పెడుతున్నారంట వీర్రాజు వీరాభిమానులు. “అదీ చూద్దాం..” అనేది వారి హ్యాష్ ట్యాగ్ లైన్ అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. మరి అప్పుడు ఆర్కే పలుకు ఎలా మడతపడుతుందనేది వేచి చూడాలి!!