నగరి రాజకీయాల్లో మళ్లీ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. వైసీపీ మాజీ మంత్రి రోజా, ఆ పార్టీ అధినేత జగన్ తో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీ వెనుక గాలి జగదీశ్ ప్రకాశ్ వైసీపీ ఎంట్రీ కీలక కారణమని అనుకుంటున్నారు. జగన్, రోజా భేటీ తర్వాత జగదీశ్ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.
గాలి ముద్దుకృష్ణమ రెండో కుమారుడు జగదీశ్ ప్రకాశ్ ఇటీవల రాజకీయంగా యాక్టివ్ అవుతూ, టీడీపీకి దూరమై వైసీపీలోకి చేరే ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మద్దతుతో జగన్ వద్దకు చేరిన జగదీశ్, తనకు పార్టీ లో చోటు కల్పించాలంటూ లాబీయింగ్ చేశారు. అయితే, నగరిలో రోజా బలంగా ఉండటంతో, ఆమె అభ్యంతరాలు జగన్ నిర్ణయాన్ని కొంతకాలం వాయిదా వేయించాయి.
ఇటీవల జగన్ అసెంబ్లీ సమావేశాల తర్వాత తాడేపల్లిలో ఎమ్మెల్యేలతో సమావేశం కావడం, ఆ తర్వాత రోజా ప్రత్యేకంగా ఆయనను కలవడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను పెంచింది. జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ పొందడమే ఉద్దేశంగా రోజా భేటీకి వెళ్ళారనే వాదన వినిపిస్తోంది. తన నియోజకవర్గంలో జగదీశ్ ప్రవేశం కంటే తన ప్రాధాన్యతను కాపాడుకోవాలనే ఆలోచనతో రోజా ఈ చర్చకు వెళ్లినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
మొత్తానికి, ఈ భేటీ తర్వాత నగరి రాజకీయాల్లో కొత్త సమీకరణలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోజా, జగన్ చర్చల ఫలితం పార్టీ లోపల పెద్ద మార్పులను తెచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జగదీశ్ ఎంట్రీ ఖరారైతే నగరిలో వైసీపీలో అంతర్గత పోరు మరింత ముదురుతుందా? లేదా జగన్ చాతుర్యంతో దాన్ని సమతుల్యం చేస్తారా? అనేది చూడాలి.