ఎన్నికల అధికారి రజత్ కుమార్ తో రేవంత్ రెడ్డి భేటి

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ను కలిశారు. తనకు భద్రతకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని రజత్ కుమార్ కు రేవంత్ రెడ్డి అందజేశారు.

తనకు రాష్ట్ర భద్రత పై నమ్మకం లేదని కేంద్ర ప్రభుత్వ భద్రత కల్పించాలని రేవంత్ రెడ్డి హైకోర్టు లో పిటిషన్ వేశారు. దీని పై విచారించిన కోర్టు రేవంత్ రెడ్డికి 4+4 భద్రతతో పాటు, ఎస్కార్ట్ నివ్వాలని తీర్పునిచ్చింది. ఆ కాపీని రేవంత్ ఎన్నికల సంఘానికి అందజేశారు. 

రేవంత్ రెడ్డి పై గతంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని ఆపరేషన్ బ్లూస్టార్ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ప్రకటించారు. దీంతో రేవంత్ రెడ్డి అప్పటి నుంచే తన భద్రత పై ఆందోళన వ్యక్తం చేశారు. టిఆర్ ఎస్ ఎంపీ బాల్క సుమన్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి దేహశుద్ది తప్పదని హెచ్చరించారు.

ఈ రెండు అంశాలను పరిగణలోకి తీసుకున్న రేవంత్ రెడ్డి తనకు టిఆర్ ఎస్ ప్రభుత్వం నుంచి, నేతల నుంచి హాని ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ అంతటా ప్రచారం చేయాల్సి ఉన్నందున తన పై దాడులు జరిగే అవకాశం ఉందని తనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే భద్రత పై నమ్మకం లేదని రేవంత్ రెడ్డి అనేక సందర్బాల్లో తెలిపారు.  

డిజిపి మహేందర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీకి లోపాయికారి మద్దతు ఇస్తున్నట్లు రేవంత్ ఆరోపించారు . అంతేకాకుండా నాగార్జున సాగర్ లో జరిగిన టిఆర్ఎస్ ప్లీనరీలో పాల్గొని మహేందర్ రెడ్డి ప్రసంగించారని చెబుతూ వచ్చారు. ఇక కేసిఆర్ మీద ఉన్న పాత కేసులు మహేందర్ రెడ్డే క్లోజ్ చేయించాడని, అందుకే మహేందర్ రెడ్డిని డిజిపిగా అపాయింట్ చేశారన్న ఆరోపణలు కూడా రేవంత్ చేశారు.    ఈ పరిస్థితుల్లో టిఆర్ఎస్ కనుసన్నల్లో పనిచేసే పోలీస్ బాస్ ఇచ్చే సెక్యూరిటీ పట్ల తనకు నమ్మకం లేదన్నారు.  

వీటన్నింటిని పరిశీలించిన కోర్టు రేవంత్ రెడ్డికి ఎన్నికలు పూర్తయ్యే వరకు రేవంత్ రెడ్డికి భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖను హైకోర్టు ఆదేశించింది. భద్రతకు అయ్యే ఖర్చునే రేవంత్ రెడ్డె భరించాలని కోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి రజత్ కుమార్ తో భేటి అయ్యి హైకోర్టు ఉత్తర్వుల కాపీ అందజేశారు. దీని పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని రజత్ కుమార్ రేవంత్ రెడ్డికి చెప్పినట్టు తెలుస్తోంది.