కేటిఆర్ ఫిట్ నెస్ మీద రేవంత్ రెడ్డి కొత్త సెటైర్

తెలంగాణ సిఎం తనయుడు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ మీద రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. అసెంబ్లీలోని సిఎల్పీ కార్యాలయ ఆవరణలో రేవంత్ తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. తెలంగాణలో పాలిటిక్స్ ఫిట్ నెస్ లో తనతో పోటీ పడే వారు ఎవరూ లేరని సవాల్ చేశారు. అన్ని రకాల చాలెంజ్ లు నడుస్తున్నాయి కాబట్టి మీరేమైనా కేటిఆర్ కు ఫిట్ నెస్ చాలెంజ్ విసరుతారా? అని మీడియా వారు రేవంత్ ను సరదాగా ప్రశ్నించారు. దీనికి రేవంత్ సమాదానమిస్తూ  మంత్రి కేటిఆర్ చేస్తున్నవన్నీ ఫిట్ నెస్ ఫోజులే తప్ప నిజం కాదన్నారు. రాజకీయాల్లోనే కాదు ఏ ఆటలో అయినా కేటిఆర్ తనతో పోటీ పడలేడని అన్నారు. కేటిఆర్ కు దమ్ముంటే తనతో 10 కే రన్ లో పోటీకి రావాలని సవాల్ చేశారు.

‘‘రేవంత్ పిచ్చకుంట్లోడు.. బతుకమ్మ చీరెలలో 150 కోట్ల స్కాం అంటడా అన్న కేటిఆర్ కామెంట్స్ పై మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా రేవంత్ నవ్వారు. బతుకమ్మ చీరల స్కాం జరిగి ఏడాది అయితున్నా ఇంకా కేటిఆర్ నా మాటలను గుర్తు పెట్టుకున్నడా అని వ్యాఖ్యానించారు. ఆయన మాటలను బట్టే అవినీతి జరిగిందో లేదో తేలిపోయింది కదా అని ఎదురు ప్రశ్నించారు.

నాడు ఉద్యమ ముసుగులో చిల్లర రాజకీయాలు చేసిన కేసీఆర్ నేడు అధికారం ముసుగులో పోలీసులతో రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో రాహుల్ గ్రాఫ్ రోజు రోజుకూ పెరుగుతున్నదని చెప్పారు. మోడీకి ధీటైన నాయకుడుగా ప్రజలకు రాహుల్ కనిపిస్తున్నాడని అన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ లో రాహుల్ స్పీచ్ తో ప్రజలకు మరింత దగ్గరయ్యారని అన్నారు. రాహుల్, మోడీని ఆలింగనం చేసుకుని తనను ద్వేషిస్తున్నావారికి మంచి సందేశాన్ని ఇచ్చారని చెప్పారు.