(కోపల్లె ఫణికుమార్)
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఒకప్పుడు సన్నిహితుడిగా ఉండిన ఐవైఆర్ కృష్ణారావు అందరినీ ఆశ్చర్యపరిచారు.
చంద్రబాబు నాయుడి సంబంధాలు బెడిశాక అయన నాయుడిని ఇరుకునెపెట్టే అనేక కార్యక్ర మాలుచేపట్టారు. దాదాపు ఆరుమాసాలుగా ఐవైఆర్ వ్యవహారశైలిని గమనించిన వారంతా ఆయన ఏదో రోజు వైసిపిలో చేరుతారని ఊహించారు.
కానీ అనూహ్యంగా ఆయన బిజెపిలో చేరారు. హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్లో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కమలం పార్టీ కండువా కప్పుకున్నారు. ఒకదశలొ బిజెపిలో చేరుతారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఆయన భావజాలం, వ్యవహారశైలి వల్ల వైసిపిలో చేరుతారని అనుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విరమణ చేసిన తర్వాత చంద్రబాబునాయుడు ఆయన్ను పిలిచి బ్రాహ్మణ కార్పొరేషన్ కు ఛైర్మన్ గా నియమించారు. కార్పొరేషన్ ఛైర్మన్ చేసినందు వల్ల బ్రాహ్మణ సామాజికవర్గాన్ని టిడిపికి దగ్గర చేస్తారని బహుశా చంద్రబాబు అనుకుని ఉంటారు. అయితే, ఐవైఆర్ ఆ పని చేయలేదు. పైగా సందర్భం వచ్చినపుడల్లా ప్రభుత్వ వ్యతిరేక స్టాండ్ తీసుకోవటం మొదలుపెట్టారు. దాంతో చంద్రబాబుకు చిర్రెత్తుకొచ్చింది. తర్వాత జరిగిన పరిణామాల్లో ఐవైఆర్ ను అవమానకరంగా ఛైర్మన్ పదవినుండి తొలగించారు.
ఇక, అప్పటి నుండి ఐవైఆర్ బహిరంగంగానే చంద్రబాబును వ్యతిరేకిచటం మొదలుపెట్టారు. రాజధాని నిర్మాణంలో లొసుగులు, భూ సేకరణలో జరుగుతున్న అక్రమాలు, ప్రభుత్వం చేస్తున్న అప్పులు, పోలవరం, ఇరిగేషన్ ప్రాజెక్టులో అవినీతి ఇలా..ప్రతీ అంశంపైనా చంద్రబాబును ఉతికి ఆరేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఇంత పెద్ద ఎత్తున తిరగబడ్డ మాజీ ఐఎఎస్ అధికారి లేరు. ఆయన ధోరణి కొంత విమర్శలకు తావిచ్చినా, ఐవైఆర్ వెనక్కు తిరిగి చూడకుండా ముఖ్యమంతి చంద్రబాబు మీద క్యాంపెయిన్ నడిపారు. ఆయన అమరావతి ఫ్రాడ్ మీద ఏకంగా ఒక పుస్తకం రాసి విడుదల చేశారు. దీనితో ఆయన పోరాటం మొత్తం వైసిపి ఆధ్వర్యంలో నడుస్తూ ఉందనే విమర్శలు వచ్చాయి.
అందులోను వైసిపిలోని కొందరు నేతలతో ఐవైఆర్ కు సన్నిహిత సంబంధాలున్నాయంటూ ప్రచారం కూడా జరుగుతోంది. దాంతో త్వరలో ఐవైఆర్ వైసిపిలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ప్రకాశం జిల్లా నుండి పోటీ చేస్తారని కూడా ఆమధ్య ప్రచారం జరిగిన విషయం అందరికీ తెలిసిందే.
ఆ ప్రచారం ఒకవైపు జరుగుతుండగానే ఐవైఆర్ తాజాగా బిజెపిలో చేరారు. నిజానికి బిజెపికి రాష్ట్రంలో ఏమాత్రం బేస్ లేదు. ఈ విషయం ఐవైఆర్ కు తెలీకుండానే ఉంటుందా ? ఒకవైపు వైసిపి అధికారంలోకి వచ్చేస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఇండియా టుడే నిర్వహించిన తాజా సర్వేలో కూడా అదే విషయం స్పష్టమైంది. ఇటువంటి నేపధ్యంలో పైగా 2019లో ఏపిలో అధికారం అందుకునే దిశగా బిజెపి పని చేస్తోందని, తాను కూడా అలానే పనిచేస్తానని చెప్పటం పెద్ద జోక్.