తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ గెలిస్తే, వైసీపీకి చెందిన ఎంపీలంతా రాజీనామా చేస్తారు.. వైసీపీ గెలిస్తే, టీడీపీకి వున్న ఎంపీలంతా రాజీనామా చేస్తారా.?’ అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ రోజు ఉదయం టీడీపీకి సవాల్ విసిరిన విషయం విదితమే. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్‌కి ప్రతి సవాల్ ఎదురైంది. ‘మొత్తంగా అందరం రాజీనామాలు చేసేసి ఎన్నికలకు వెళదాం.. వైసీపీ గెలిస్తే, టీడీపీని మూసేస్తాం..’ అంటూ సలచలన రీతిలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ‘బస్తీ మే సవాల్’ అనేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళవుతోంది. ఈ రెండేళ్ళలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. పంచాయితీ, మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ పతనం స్పష్టమైపోయినా, టీడీపీ నేతలు మాత్రం, ఇంకా అధికార వైసీపీకి సవాల్ విసురుతూనే వున్నారు. రాజకీయాల్లో ఈ సవాళ్ళు.. ప్రతి సవాళ్ళు మామూలే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో, వైసీపీ ఇలానే సవాళ్ళు విసిరేది.
టీడీపీ అప్పట్లో ఏనాడూ ఆ సవాళ్ళ పట్ల స్పందించలేదు. అలాంటి టీడీపీ, ఇప్పుడు వున్న పళంగా వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేయాలన్న తపనతో వుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ఇదిలా వుంటే, తిరుపతి ఉప ఎన్నిక విషయంలో ప్రచారం పరంగా తెలుగుదేశం పార్టీ, మిగతా రాజకీయ పార్టీలతో పోల్చితే ఒకింత అగ్రెసివ్‌గానే కనిపిస్తోంది. వైసీపీ కూడా అంతకు మించి.. అనే స్థాయిలో ప్రచారం పరంగా ఉధృతంగా కనిపిస్తున్నా అభ్యర్థి విషయంలోనే ఓటర్లలోనే కొంత గందరగోళం వుంది. ‘అభ్యర్థి ఎవరన్నది ఇక్కడ విషయం కాదు.. వైసీపీ గుర్తుకి వున్న పవర్ చాలు.. వైసీపీ రికార్డు స్థాయి మెజార్టీ దక్కించుకోవడానికి..’ అని వైసీపీ నేతలంటున్నారు. తిరుపతి సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ హఠాన్మరణం చెందితే, మృతదేహానికి ముఖ్యమంత్రి నివాళులర్పించేలదన్న అంశాన్ని చంద్రబాబు తెరపైకి తెస్తుండడం గమనార్హం.